రిలీజ్ చేసింది ఒకే ఒక్క సీన్. దానికి బాలకృష్ణ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఓ మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ఇస్తున్న రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నర్తనశాల గురించే.
అప్పుడెప్పుడో 17 ఏళ్ల కిందట బాలయ్య తీసిన 2 సన్నివేశాల్ని తాజాగా విడుదల చేశారు. దానికి సీనియర్ ఎన్టీఆర్ చేసిన సన్నివేశాల్ని కూడా కలిపేశారు.
అలా విడుదల చేసిన సన్నివేశాలకు అద్భుతమైన స్పందన వస్తోందట. అందుకే బాలయ్య మరోసారి మీడియా ముందుకొచ్చారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు. అక్కడితో ఆగలేదు. నర్తనశాల మళ్లీ తీస్తానంటూ శపథం చేశారు.
“జనం చూపిస్తున్న ఆదరాభిమానాలతో చలించిపోయాను. మంచి సినిమా ఇచ్చారని అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని ఇవ్వమంటున్నారు. అందుకే నర్తనశాల మళ్లీ తీయాలనిపిస్తోంది. తప్పకుండా నర్తనశాల చేస్తాను. ఈ సినిమాలో నాలుగు పాత్రలు చేయాలనుకున్నాను. అర్జునుడు, బృహన్నల, కీచకుడు, కృష్ణుడు పాత్రలు వేయాలనుకున్నాను. అర్జునుడి పాత్రతో సినిమా స్టార్ట్ చేశాను.”
ఇలా నర్తనశాల తీస్తానంటూ కమిట్ అయిపోయారు బాలయ్య. తను తీసిన 2 సన్నివేశాలపై దాదాపు 40 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. దర్శకుడిగా మీ అనుభవం ఎలా ఉందంటూ యాంకరమ్మ అడగడం, దానికి మళ్లీ బాలయ్య “మా నాన్నగారు” అంటూ గతంలోకి వెళ్లిపోవడం..బృహన్నల పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేశారని యాంకర్ అడగడం.. పెద్ద రీసెర్చ్ చేశానని బాలయ్య చెప్పడం.. ఇలా ఎన్నో ఆణిముత్యాలున్నాయి ఈ ఇంటర్వ్యూలో.
ఇవన్నీ ఒకెత్తయితే.. మళ్లీ దర్శకుడిగా ఎందుకు మారలేదు, ప్రేక్షకుల్ని ఎందుకు అలరించలేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. బాలయ్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మరో ఎత్తు. ఆయన ఎక్స్ ప్రెషన్స్ వర్ణించడానికి మాటల్లేవంతే.