పాకిస్తాన్, చైనా దేశాలతో ఎప్పుడు యుద్ధం చేయాలనే అంశం గురించి ప్రధానమంత్రి మోడీ పూర్తి స్పష్టతతో ఉన్నారట, ఇప్పటికే తేదీలు కూడా ఫిక్స్ చేశారట, ఆ తేదీల కోసం మాత్రమే వేచి ఉన్నారట.. ఆ తేదీలు రావడమే ఆలస్యం పాక్, చైనాల పీచమణిచేయడమే!.. ఇది ఏ వాట్సాప్ యూనివర్సిటీలోని ఏదో సాదాసీదా భక్తుడు ఫార్వర్డ్ చేసిన మాట కాదు.
వాట్సాప్ యూనివర్సిటీలో మార్మోగడానికి యూపీ బీజేపీ విభాగం అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ చేసిన ప్రసంగంలోని పాఠం! రామమందిరం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలను మోడీ విజయాలుగా అభివర్ణించిన ఈ బీజేపీ నేత చైనా, పాక్ లతో యుద్ధం రాబోతోందని స్పష్టం చేశారు.
అందుకు తేదీలు కూడా ఫిక్స్ అయినట్టుగా చెప్పారు. ఈ యుద్ధ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయేమో, దేశంలో ప్రజలు మహా నగరాలను వీడి పల్లెలకు పరుగులు తీస్తారేమో! దేశంలో పెద్ద రాష్ట్రం, బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న రాష్ట్రంలోని కమలం పార్టీ అధ్యక్షుడే యుద్ధ ప్రకటన చేశాకా.. ఇక ఆగేదేముంది! యుద్ధం వచ్చేస్తున్నట్టే! ఆ తేదీలు మాత్రం ప్రస్తుతానికి రహస్యం.
మోడీ ఏం చేసినా ఉన్నట్టుండి చేస్తారు. అర్ధరాత్రితో అమలు చేసేస్తారు. బహుశా యుద్ధం కూడా అంతే కాబోలు. ఈ బీజేపీ నేతెవరో మంచి వాడై ముందే జాతిని అలర్ట్ చేశారు. యుద్ధం వచ్చస్తోంది… సంసిద్ధంగా ఉండడని ప్రకటించేశారు.
అంతేకాదట.. యూపీలోని పలు పార్టీలు ఉగ్రవాదులకు మద్దతునిస్తున్నాయట. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు టెర్రరిస్టులకు సహకరిస్తున్నాయట. ఈ విషయాన్ని కూడా సదరు స్వతంత్రసింగ్ ప్రకటించారు. అయినా..అంత పక్కాగా తెలిసినప్పుడు ఇంకా ఎందుకు లేటు చేస్తున్నట్టు? ముదుసలి ములాయం సింగ్ యాదవ్ ను జైల్లో పడేయరాదా? అఖిలేష్ ను లోపలికి తోసేయకూడదా? మాయవతిపై మమకారం ఎందుకు? ఉగ్రవాద నిరోధక చట్టం పోటా నో, తూటానో ప్రయోగించరాదా!