సీఎం జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించడం, ప్రధాని మోడీ, అమిత్ షా వరుసబెట్టి జగన్ కి అపాయింట్ మెంట్లు ఇవ్వడం, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతివ్వడం.. ఇలాంటి పరిణామాలన్నీ బీజేపీ-వైసీపీ మధ్య దూరాన్ని తగ్గించేశాయి.
సహజంగానే టీడీపీకి, జనసేనకు ఈ వ్యవహారం కంటగింపుగా మారింది. అదే సందర్భంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం.. జగన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు పూర్తిగా తగ్గించేశారు. హైకమాండ్ నేరుగా చెప్పకపోయినా, పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టి మరీ దూకుడుగా వెళ్లడం లేదు.
అదే టైమ్ లో టీడీపీపై విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో జనసేన మరింతగా ఇబ్బంది పడుతోంది. జగన్ అంటే జలసీతో రగిలిపోయే పవన్ కి ఈ వ్యవహారం పూర్తిగా నచ్చడం లేదు. అందుకే ఆయన బీజేపీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో చేసే ఏ కార్యక్రమంలో అయినా కలిసి పాల్గొంటాం అని పొత్తుపొడుపు వేళ.. జనసేన, బీజేపీ నాయకులు యుగళగీతం వినిపించారు. దానికి తగ్గట్టే.. హడావిడిగా మీటింగ్ లు పెట్టుకున్నారు, ఇరు పార్టీల సమీక్ష సమావేశాలు జరుపుకున్నారు. భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు.
నిన్న మొన్న అంతర్వేది ఆందోళనల్లోనూ రెండు పార్టీల జెండాలు కలిసే కనిపించాయి. ఇప్పుడు బీజేపీ, వైసీపీ మధ్య శత్రుత్వం లేదని తేలిపోవడంతో.. జనసేన, బీజేపీ మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల రెండు పార్టీల నేతలు కలసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటీ లేదు.
వరద బాధితుల పరామర్శలకు ఎవరికి వారే వెళ్తామంటున్నారు. సేవా కార్యక్రమాలైనా, దసరా సంబరాలైనా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు. విజయవాడలో బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా జనసేన నాయకులకు పిలుపు అందలేదంటే ఈ గ్యాప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తమ్మీద బీజేపీ, జనసేన రెండోసారి మొదలుపెట్టిన కాపురం కూడా అతి తక్కువ కాలంలోనే విడాకులకు దారి తీసేలా కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ దూరంగా ఉండటానికి కూడా ఇదీ ఓకారణం అంటున్నారు.
బీజేపీకి దూరమైతే పవన్ కల్యాణ్ కొత్త జోడీ దొరికే వరకు బాధపడతారేమో కానీ, జనసైనికులు మాత్రం సంతోషంగా ఉంటారు. సొంతంగా ఎదిగేందుకు ఓ అవకాశం దొరికిందని సంబరపడతారు.