మెట్రో కూడా జగన్ ఖాతాలోనే.. బాబు కలలు గల్లంతే

ప్రపంచస్థాయి రాజధాని, కలల రాజధాని అంటూ అమరావతి గురించి గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు. ఐదేళ్లు కాలక్షేపం చేసి అనుకూల మీడియాలో గ్రాఫిక్స్ చూపించి.. తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టారు. బాబు కలల్లో విజయవాడ మెట్రో కూడా…

ప్రపంచస్థాయి రాజధాని, కలల రాజధాని అంటూ అమరావతి గురించి గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు. ఐదేళ్లు కాలక్షేపం చేసి అనుకూల మీడియాలో గ్రాఫిక్స్ చూపించి.. తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టారు. బాబు కలల్లో విజయవాడ మెట్రో కూడా ఒకటి. 

బెజవాడతో పాటు.. రాజధాని ప్రాంతాన్ని కూడా అనుసంధానం చేస్తూ మెట్రో రైలు తీసుకొస్తామంటూ అప్పట్లో ఊదరగొట్టారు బాబు. ఎలాగూ విభజన చట్టంలో మెట్రో అంశం ఉంది కాబట్టి.. కేంద్రం నిధులతో పబ్బం గడుపుకొని, పేరు తాను కొట్టేయొచ్చు అనుకున్నారు.

అలా  చంద్రబాబు హయాంలో 2015 అక్టోబర్ 29న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మొదట్లో విజయవాడకే పరిమితం అనుకున్నా, ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్ తో విశాఖను కూడా అందులో చేర్చారు. అప్పటి అమరావతి మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రతిపాదనలు కేంద్రానికి నచ్చకపోవడంతో దాన్ని పక్కనపెట్టేశారు.

దీంతో చంద్రబాబు లైట్ మెట్రో అంటూ మరో ప్రతిపాదన సిద్ధం చేశారు, ఇది ఏపీ ప్రభుత్వ మెట్రో సలహాదారు, మెట్రో మ్యాన్ గా పేరున్న ఇ.శ్రీధరన్ కి నచ్చక ఆయన తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అలా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కేసింది. ఇప్పుడు జగన్ జమానాలో మళ్లీ మెట్రో పట్టాలెక్కబోతోంది. అయితే విజయవాడలో కాదు, విశాఖలో.

ఇటీవల విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తున్నా.. ఇది ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదని ఉత్తరాంధ్ర వాసులు లైట్ తీసుకున్నారు. అయితే అనుకున్నది చేయడంలో జగన్ ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. 

కోర్టుల్లో కేసులు ఉండటంతో.. మూడు రాజధానుల ప్రతిపాదన కాస్త వెనకపడ్డా, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఆలస్యం అవుతున్నా.. మెట్రోని మాత్రం చకచకా తెరపైకి తెచ్చారు. విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయం కూడా మొదలైంది.

అంతే కాదు.. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని, నవంబర్ లో టెండర్లు పిలుస్తామని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఐదేళ్ల పాటు కేవలం ఫైల్స్ తోనే నడిపిన వ్యవహారాన్ని, జగన్ రెండేళ్ల లోపే టెండర్ల వరకు తీసుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల పరిధిలో విశాఖ మెట్రో నిర్మాణం కాబోతోంది. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందని బొత్స చెప్పడం మరో సంచలనం.

అంటే.. చంద్రబాబులాగా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ లను అటకెక్కించడం తనకి ఇష్టంలేదని జగన్ మరోసారి స్పష్టం చేసినట్టయింది. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ప్రభుత్వం పరిధిలో ఉంటుందా లేక, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. 

మొత్తమ్మీద.. చంద్రబాబు ప్రాజెక్ట్ ల పేరు చెప్పి కోట్ల రూపాయలు పేపర్లపై ఖర్చు చూపిస్తే.. జగన్ వాటిని అమలులలో పెట్టి అసలుసిసలు పనిమంతుడు అనిపించుకుంటున్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఈ పోలికలన్నీ తెరపైకి వస్తే టీడీపీ భవిష్యత్ ఏంటా అని బాబు ఇప్పట్నుంచే దిగులు పడుతున్నారు.  

పవన్ కళ్యాణ్ వచ్చినా, ఏ కళ్యాణ్ వచ్చినా భయపడేది లేదు