తార‌కర‌త్న దంప‌తుల‌పై ద్వేషం …అలేఖ్య పోస్టు వైర‌ల్‌!

తార‌క‌ర‌త్న భౌతికంగా ఈ లోకాన్ని వీడి ఇవాళ్టికి స‌రిగ్గా నెల రోజులైంది. తార‌క‌ర‌త్న జ్ఞాపకాలు మాత్రం స‌జీవంగా ఉన్నాయి. ముఖ్యంగా భ‌ర్త‌తో త‌న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయ‌న భార్య అలేఖ్య త‌ర‌చూ సోష‌ల్…

తార‌క‌ర‌త్న భౌతికంగా ఈ లోకాన్ని వీడి ఇవాళ్టికి స‌రిగ్గా నెల రోజులైంది. తార‌క‌ర‌త్న జ్ఞాపకాలు మాత్రం స‌జీవంగా ఉన్నాయి. ముఖ్యంగా భ‌ర్త‌తో త‌న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయ‌న భార్య అలేఖ్య త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల 18న తార‌క‌ర‌త్న మృతి చెంద‌డంతో, నెల‌రోజుల‌వుతున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఇన్‌స్టాలో అలేఖ్య పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది. ఎందుకంటే దంప‌తులుగా త‌మ ప్ర‌యాణంలో ఎదురైన ప్ర‌తిబంధ‌కాల‌ను ఆమె ట‌చ్ చేయ‌డం ఈ పోస్ట్ ప్ర‌త్యేకం.

తార‌క‌ర‌త్న‌, అలేఖ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి జీవితంలో అనేక ఆటుపోట్లు ఉన్నాయి. ద‌గ్గ‌రి వాళ్ల నిరాద‌ర‌ణ ఉంది. అంద‌రూ ఉన్నా ఎవ‌రూ లేనివారిగా ఒకానొక స‌మ‌యంలో జీవించాల్సి వ‌చ్చింద‌ని ఆమె నేరుగానే ఈ పోస్టు ద్వారా ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. తాజా భావోద్వేగ పోస్టులో న‌ర్మ‌గ‌ర్భ విష‌యాలు ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ పోస్టులోని కీల‌క విష‌యాల గురించి తెలుసుకుందాం.

‘మమ్మల్ని నువ్వు విడిచి సరిగ్గా నెల రోజులైంది. కానీ నీ జ్ఞాపకాలు మా మదిలో క‌ద‌లాడుతూనే వున్నాయి. క‌లిసి జీవించ‌డానికి నేను భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో నువ్వు ధైర్యంగా ముంద‌డుగు వేయ‌డంతోనే కొత్త జీవితాన్ని ప్రారంభించాం. వివక్షను ఎదుర్కొన్నాం. జీవితాన్ని ముందుకు సాగించ‌డానికి ఎంతో పోరాటం చేశావు. నిష్కమ్మ పుట్టిన తర్వాత జీవితం మొత్తం మారిపోయింది. సంతోషం రెండింత‌లు అయిన‌ప్ప‌టికీ, బాధలు అలాగే మిగిలాయి. మనపై  చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు కళ్లకు గంతలు కట్టుకుని బతికాం. నీ కుటుంబానికి దూరమయ్యావు. అందుకే మనకంటూ పెద్ద కుటుంబం కావాలని కోరుకున్నావు.

2019లో ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో మన కుటుంబం పెద్దదైంది. నీ కోరిక నెరవేరింది. నీ హృదయ భారాన్ని, బాధ‌ను అర్థం చేసుకున్న వాళ్లే లేరు. మన అనుకున్న వాళ్లే బాధించినప్పుడు అది గుండెకు ఎంతో బరువు అవుతుంది. నేను  నిస్సహాయంగా ఉండాల్సి వ‌చ్చింది. తొలి నుంచి మ‌ద్ద‌తుగా ఉన్న వాళ్లు కూడా దూర‌మై చాలా కాల‌మైంది. నువ్వే మా రియల్‌ హీరో. నీతో క‌లిసి ప్ర‌యాణించింది చాలా చిన్న‌దే కావ‌చ్చు.  కానీ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనంత అద్భుత‌మైన ప్ర‌యాణం. శాంతి, చిత్తశుద్ధి ఉన్న చోట మళ్లీ  కలుద్దాం. మిస్‌ యు ఓబు’ అని అలేఖ్య రాసుకొచ్చారు. ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డానికి తార‌క‌ర‌త్న‌, అలేఖ్య  వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన అంశాలే కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.