మూడు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార పక్షం వైసీపీకి ఎదురుగాలి వీచడంతో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఎన్నికల్లో విజయం అనేది ప్రతిపక్షాలకు అందని ద్రాక్ష చందంగా తయారైంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఒక్కసారిగా గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో విజయం దక్కడం నిజంగా భారీ ఊరటే అని చెప్పాలి.
ఇదే సందర్భంలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో సిట్టింగ్ స్థానాలను పోగొట్టుకున్న ప్రతిపక్షాలు కూడా …. ఈ ఫలితాలు సీఎం జగన్కు చెంప పెట్టని, ప్రజాస్వామ్యం విజయమని అభివర్ణించడం విడ్డూరంగా వుంది. ఉత్తరాంధ్రలో సిట్టింగ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవ్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. కనీసం ఆయనకు చెల్లని ఓట్లన్ని కూడా రాకపోవడం గమనార్హం. బీజేపీ నేతలు ఈ విషయాన్ని విస్మరించి మీడియా ముందుకొచ్చి సీఎం జగన్ను విమర్శిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ చేజార్చుకునే దిశగా పయనిస్తోంది. ఈ కథనం రాసే సమయానికి అక్కడ కౌంటింగ్ సరళిని గమనిస్తే… నువ్వానేనా అన్నట్టే సాగుతోంది. అలాగే తూర్పు, పశ్చిమ రాయలసీమ టీచర్స్ స్థానాలను పీడీఎఫ్ కోల్పోయింది. ఈ రెండు స్థానాల్లో వైసీపీ అనూహ్యంగా విజయాలు నమోదు చేసుకుంది. అంతేకాదు, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో ఇంత కాలం పీడీఎఫ్ నాయకుడు కొనసాగారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలకు చెందిన పీడీఎప్ ఘోరంగా దెబ్బతింది.
ఏకంగా మూడు సిట్టింగ్ ఎమ్మెల్సీలను కోల్పోయింది. అయినప్పటికీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. జగన్కు విద్యావంతులు బుద్ధి చెప్పారని విమర్శించడం గమనార్హం. అసలు ఉనికే కోల్పోయామన్న స్పృహ వామపక్షాలకు లేకపోవడం గమనార్హం. మరి ఏ రకంగా జగన్ను విమర్శిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం వామపక్షాలకు ఉంది.