గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల షాక్ నుంచి అధికార పక్షం వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఉత్తరాంధ్ర, తూర్పురాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో ఊహించని విధంగా వైసీపీ ఓటమిపాలైంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం అనూహ్యంగా విజయాలు నమోదు చేసుకుంది. దీంతో టీడీపీకి ప్రాణం లేచి వచ్చినట్టైంది. మరోవైపు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ ఎదురీదుతోంది. రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపునకు వచ్చే సరికి టీడీపీ మద్దతుదారుడైన భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆధిక్యంలోకి రావడం విశేషం.
దీంతో ఆ స్థానంపై కూడా వైసీపీకి ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇదే సందర్భంలో తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానాల నుంచి గెలుపొందడం వైసీపీకి ఊరటనిచ్చే విషయం. గ్రాడ్యుయేట్స్ స్థానాలకు సంబంధించి ఈ రకమైన ఫలితాలను వైసీపీ అసలు ఊహించలేదు. ఓటమిపై అధికార పార్టీ విశ్లేషణలు మొదలు పెట్టింది. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకతా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో చర్చించుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి, ఒక్కసారి బుద్ధి చెబితే తప్ప సీఎం జగన్కు వాస్తవాలు అర్థం కావనే ఉద్దేశంతో కూడా వైసీపీ అభిమానులే వ్యతిరేకం చేశారనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఫలితాలు ఒక రకంగా మంచిదనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు తత్వం బోధపడి నేలదిగి వస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. రానున్న రోజుల్లో అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఈ ఓటమి దోహదపడుతుందని వైసీపీ పెద్దలు అంటున్నారు.