ప్రపంచంలోనే పొట్టి బాడీ బిల్డర్ ఓ ఇంటివాడయ్యాడు..

కండలు తిరిగిన దేహం, అదిరిపోయే బాడీ షేప్, మజిల్స్ తో మటాష్ చేసేలా కనిపిస్తాడు. ఇంత బిల్డప్ ఇచ్చారు ఇంతకీ అతను ఎలా ఉంటాడనుకుంటున్నారా. జస్ట్ 3 అడుగుల 4 అంగుళాల హైట్ మాత్రమే…

కండలు తిరిగిన దేహం, అదిరిపోయే బాడీ షేప్, మజిల్స్ తో మటాష్ చేసేలా కనిపిస్తాడు. ఇంత బిల్డప్ ఇచ్చారు ఇంతకీ అతను ఎలా ఉంటాడనుకుంటున్నారా. జస్ట్ 3 అడుగుల 4 అంగుళాల హైట్ మాత్రమే ఉంటాడు. పేరు ప్రతీక్ విఠల్ మొహిత్. 

మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ వయసు 28 ఏళ్లు. ప్రపంచంలోనే అతి పొట్టి బాడీబిల్డర్ అతడు. ఆ క్రెడిట్ కూడా అంత ఈజీగా అతనికి దక్కలేదు. ప్రతిసారీ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్తూ, అందులో కప్పులు గెలుస్తూ గిన్నిస్ బుక్ కి ఎక్కాడు. ఇప్పుడతను ఓ ఇంటివాడయ్యాడు.

ఎంత సిక్స్ ప్యాక్ ఉన్నా, దానికితోడు సిక్స్ ఫీట్ ఉంటేనే అందం అనుకుంటారు చాలామంది. కానీ మూడడుగుల సిక్స్ ప్యాక్ ధీరుడ్ని కూడా ఓ యువతి వలచింది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ఎత్తు కూడా 4 అడుగుల 2 అంగుళాలు మాత్రమే కావడం విశేషం. ఆ యువతి పేరు జయ. సిక్స్ ప్యాక్ చూసి ప్రతీక్ ని ప్రేమించింది. ఇంట్లో పెద్దల్ని ఒప్పించి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

బాడీ బిల్డింగ్ తో పాటు అక్కడక్కడా స్టేజ్ షో ల ఇస్తుంటాడు ప్రతీక్. గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల తోడ్పాటు తనకు చాలా ఎక్కువగా ఉందన్నాడు ప్రతీక్. అందరి ప్రోత్సాహంతోనే తాను ఆత్మన్యూనత భావం వీడి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించానని చెబుతాడు. జిమ్ లో పరికరాలు తనకు ఇబ్బందిగా ఉన్నా కూడా వాటికి అలవాటు పడి, స్నేహితుల సాయంతో కసరత్తులు చేసేవాడనని అంటాడు.

అయితే ఇప్పుడు ఉపాధి తనకు సమస్యగా మారిందని, అర్జంట్ గా తాను ఓ ఉద్యోగం వెదుక్కోవాలంటున్నాడు ప్రతీక్. తనతోపాటు, తన భార్యను పోషించడానికి మంచి జాబ్ చేస్తానంటున్నాడు. గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ తమ ఆఫీస్ లో ఉన్నాడని చెప్పుకోడానికి ఎవరు మాత్రం వెనకాడతారు చెప్పండి. ప్రతీక్ కి చాలా కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. వాటిలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకుంటానంటున్నాడు ఈ పొట్టి గట్టి బాడీ బిల్డర్.