ఇలా భ్రష్టు పట్టిపోతే అధికారంలోకి ఎలా వస్తుంది ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఎప్పుడూ ఒకటే మంత్రం జపిస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అనేది బీజేపీ నాయకులు వల్లిస్తున్న మంత్రం. తెలంగాణలో ఈ మంత్రం చదువుతున్నారంటే అంతో ఇంతో…

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఎప్పుడూ ఒకటే మంత్రం జపిస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అనేది బీజేపీ నాయకులు వల్లిస్తున్న మంత్రం. తెలంగాణలో ఈ మంత్రం చదువుతున్నారంటే అంతో ఇంతో అర్ధం ఉందనుకోవచ్చు. కానీ ఏపీలో ఎలా అధికారంలోకి  వస్తారు ? ఏ కోణం నుంచి చూసినా అందుకు అవకాశాలు కనబడటం లేదు.

కేంద్రంలోని బీజేపీ (అంటే ఎన్డీయే) ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీకి అన్యాయం చేసింది కదా. కీలకమైన ఏ హామీలూ నెరవేర్చలేదు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని సమర్ధిస్తూ ఏపీ బీజేపీ నాయకులు అదే పనిగా మాట్లాడారు.అమిత్ షా క్లాస్ తీసుకున్న తరువాతే అమరావతి మీద బీజేపీ నాయకుల్లో కదలిక వచ్చి దాన్ని సమర్ధించారు.

ఈ మధ్య నిర్వహించి ప్రజా ఆగ్రహ సభలో పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో పార్టీ పరువు గంగలో కలిసింది. పైగా సోము వీర్రాజు, ఇతర బీపీ నాయకులు ఆ వ్యాఖ్యలను సమర్ధించుకోవడానికి పడుతున్న తిప్పలు చూసి ప్రజలు ఆగ్రహించడమే కాదు అసహ్యించుకుంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి బీజేపీ ప్రజా ఆగ్రహ సభ పెడితే అది రివర్స్ లో బీజేపీ మీదనే ప్రజా ఆగ్రహంగా మారింది.

ఇంత జరిగినా బీజేపీ నాయకులకు బుద్ధి రాలేదు. చీప్ లిక్కర్ కామెంట్స్ తో పరువు పోగా పార్టీ నాయకులు పార్టీ కార్యాలయంలోనే చీప్ గా సినిమా పాటలకు చిందులు వేయడంతో పార్టీ పరువు మురుగు కాలువలో కలిసింది. చిందులు వేసిన వీడియో వైరల్ కావడంతో ఘాటు వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు బీజేపీ నాయకులకు తల బొప్పి కడుతోంది.

దీంతో గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చకపోతే దాన్ని కూలుస్తామని, విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరు మార్చాలని రంకెలు వేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా బీజేపీ విజయవాడ సిటీ పార్లమెంట్ నియోజకవర్గం కార్యాలయంలో కొందరు నాయకులు వేదిక మీద  చిందులేశారు. ఎన్టీ రామారావు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటకు అద్దిరిపోయేలా స్టెప్స్ వేశారు.

మహిళా నాయకులు సైతం ఫుల్ జోష్‌లో కనిపించారు ఈ వీడియోలో. నీ కౌగిలింతలోనే.. అంటూ మైమరిచిపోయి చిందులేశారు. ఎన్టీఆర్ హావ భావాలతో విరగదీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తోంది. వైరల్‌గా మారింది. బీజేపీ నాయకుల తీరు ఇదీ అంటూ ప్రపంచానికి తెలియజేసినట్టయింది. ఇలాంటి చీప్ నాయకులు వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదంటున్నారు జనాలు.

ఈ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డికి పంపారు. ఏపీ బీజేపీ అధోగతి పడుతోందంటూ మండిపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ నేర్చించిన సంస్కృతి ఇదేనా అంటూ కడిగిపారేస్తున్నారు.