కొడాలి నాని ప్రాణ‌స్నేహితుడిపై మంత్రి ఫైర్‌

మంత్రి కొడాలి నాని ప్రాణ స్నేహితుడైన‌ టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాపై దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వంగ‌వీటి రాధాను ఇప్ప‌టికే జ‌నం మ‌రిచిపోయార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం…

మంత్రి కొడాలి నాని ప్రాణ స్నేహితుడైన‌ టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాపై దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వంగ‌వీటి రాధాను ఇప్ప‌టికే జ‌నం మ‌రిచిపోయార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. 

గ‌త నెల 26న వంగ‌వీటి రంగా వర్ధంతి నాడు ఆయ‌న త‌న‌యుడు రాధా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌ను హ‌త్య చేసేందుకు రెక్కీ నిర్వ‌హించార‌ని, ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని హెచ్చ‌రించారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు అన్ని వివ‌రాలు బ‌య‌ట పెడ‌తాన‌ని ఆయ‌న తెలిపారు. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ స‌మ‌క్షంలోనే రాధా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వంగ‌వీటి రాధాపై రెక్కీ అంశం రాజ‌కీయ రంగు పులుముకుంది. రాధాను ప‌రామ‌ర్శించిన అనంత‌రం ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ మంత్రి వెల్లంప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ రాధాపై విరుచుకుప‌డ్డారు. వంగ‌వీటి రాధాను అడ్డు పెట్టుకుని చంద్ర‌బాబు డ్రామా ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు.

త‌న‌పై రెక్కీ నిర్వ‌హించార‌ని ఆరోపిస్తున్న రాధా… అందుకు సంబంధించిన ఆధారాలు బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో రాధా త‌ప్పుడు దారిలో న‌డుస్తున్నార‌ని విమ‌ర్శించారు. మెయిన్‌రోడ్డులో రాధా ఉంటార‌ని, ఆ మార్గంలో కారు వెళితే రెక్కీ నిర్వ‌హించిన‌ట్టు అవుతుందా? అని నిల‌దీశారు. అస‌లు రెక్కీపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారా అని ప్ర‌శ్నించారు.

త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని రాధా చెప్ప‌గానే త‌మ సీఎం వైఎస్ జ‌గ‌న్ గ‌న్‌మెన్ల‌ను పంపార‌ని గుర్తు చేశారు. గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కి పంచి ఛీప్ పాలిటిక్స్‌కు పాల్ప‌డ్డార‌ని రాధాపై వెల్లంప‌ల్లి మండిప‌డ్డారు. ఇదంతా రాజ‌కీయ‌ ల‌బ్ధి కోస‌మే చంద్ర‌బాబు  డైరెక్ష‌న్‌లో రాధా న‌డుస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో రాధాను మ‌రిచిపోయార‌ని వెల్లంప‌ల్లి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ హ‌యాంలో రంగా ఎందుకు దీక్ష చేశారో రాధా తెలుసుకోవాల‌ని వెల్లంప‌ల్లి కోరారు. టీడీపీ హ‌యాంలో త‌న తండ్రి హ‌త్య జ‌రిగితే, ఆ పార్టీ నేత‌ల‌తోనే అంట‌కాగుతున్నార‌ని మండిప‌డ్డారు. ఏదైనా ఒక ప‌ద్ధ‌తి ఉండాల‌ని రాధాకు వెల్లంప‌ల్లి హిత‌వు చెప్పారు.