ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. విజయదశమిని పురస్కరించు కుని ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ దుర్గమ్మను దర్శించుకుని కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకున్నట్టు తెలిపారు. దసరా రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకున్నామని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని, అలాగే దేశంలో అత్యధిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న పార్టీ తమదేనన్నారు.
పదవులతో సంబంధం లేకుండా బీజేపీ నేతలంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొదటి నుంచి పార్టీలో ఉంటూ నేడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.