హతవిధీ.. రవితేజను కూడా వదలని బాలయ్య

“ఓ సినిమా చేయి ప్లీజ్.. నీ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తా.. మన కాంబినేషన్ ఎప్పుడు..” టాక్ షోలో బాలయ్య నోటి నుంచి కామన్ గా వినిపించే డైలాగ్స్ ఇవి. అంత పెద్ద…

“ఓ సినిమా చేయి ప్లీజ్.. నీ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తా.. మన కాంబినేషన్ ఎప్పుడు..” టాక్ షోలో బాలయ్య నోటి నుంచి కామన్ గా వినిపించే డైలాగ్స్ ఇవి. అంత పెద్ద హీరో, సీనియర్ నటుడు.. తన టాక్ షో కు వచ్చే దర్శకుల్ని ఇలా అడగడం ఏం బాగాలేదంటూ నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు కూడా. బాలయ్య భోళా అని కొందరు, షోను రక్తి కట్టించడం కోసం బాలయ్య అలా బావుకుంటారని మరికొందరు సర్దిచెప్పుకున్నప్పటికీ.. ఓవరాల్ గా విమర్శలు మాత్రం తప్పలేదు.

ఇప్పుడీ విమర్శలు తారాస్థాయికి చేరేలా వ్యవహరించారు బాలయ్య. తన కార్యక్రమానికి వచ్చే దర్శకుల్ని ఇన్నాళ్లూ సినిమా చేయమని అడిగిన బాలయ్య.. ఇప్పుడు ఏకంగా హీరో రవితేజను కూడా అదే ప్రశ్న అడిగి నందమూరి ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిశారు.

తాజాగా బాలయ్య టాక్ షోకు రవితేజ వచ్చాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు, గతంలో గొడవలు లేవనే విషయాన్ని టాక్ షో ప్రారంభంలోనే క్లియర్ చేశారు. ఇక అలా మాట్లాడుతూ మధ్యలో “నీలో మంచి దర్శకుడు కూడా ఉన్నాడంటగా” అంటూ బాలయ్య మొదలుపెట్టారు. దీనికి సమాధానంగా రవితేజ పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చాడు.

“నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. నాలో ఎప్పుడూ డైరక్టర్ ఉంటాడు. నా సినిమా దర్శకులతో కూడా నేను మాట్లాడతాను. డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో సూచనలు చేస్తుంటాను. సెట్స్ పైకి వచ్చిన తర్వాత మాత్రం నటుడిగా మాత్రమే ఉంటాను. దర్శకుడి పనిలో వేలు పెట్టను. ప్రస్తుతం అంతా బాగా నడుస్తోంది కాబట్టి దర్శకుడ్ని లోపలే దాచాను. కచ్చితంగా నా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. అందులో నేను మాత్రం నటించను, మా అబ్బాయిని కూడా డైరక్ట్ చేయను.”

ఇలా “నేను-నా దర్శకత్వం” అంటూ రవితేజ ఏదేదో చెబుతున్నాడు. అంతలోనే బాలయ్య తన సహజ శైలిలో రవితేజ మాటల ప్రవాహాన్ని ఆపాడు. నీ దర్శకత్వంలో నేను సినిమా చేస్తానమ్మా అంటూ హామీ ఇచ్చారు. తమ కాంబినేషన్ లో వచ్చే సినిమా మాస్ అమ్మ మొగుడులా ఉంటుందంటూ తనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చుకున్నారు.