ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కే వచ్చింది. ఆయన తన కుమారుడు లోకేష్‌ను ఎలా ప్రమోట్ చేయాలో తెలియక సతమతం అవుతున్నట్లుగా ఉంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చెన్నాయుడును నియమించడంతో ఈ అభిప్రాయం కలుగుతుంది.
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కష్టాలు పెట్టినా, వాటన్నిటిని తట్టుకుని తన శక్తి ఏమిటో రుజువు చేసుకున్న నేపథ్యంలో ఆయనను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కిందామీద అవుతున్నట్లుగా ఉంది.
సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో తమ తర్వాత తమ కుటుంబ సభ్యులను ప్రమోట్ చేస్తుంటారు. అది కరెక్టా? కాదా అన్నది వేరే విషయం. తమ కుటుంబ సభ్యులు సమర్థులా? కాదా అన్నది చర్చనీయాంశంగా ఉంటుంది.
అచ్చెన్నాయుడును అధ్యక్షుడిగా నియమించినా పెత్తనం చేసేది అంతా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లే అన్నది బహిరంగ రహస్యం. ఇంతవరకు ఈ పార్టీకి ఏపీ అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకటరావు అదే ప్రకారం వారికి విధేయుడుగా పనిచేశారు.
అంత సీనియర్ అయినా కళా వెంకటరావు పార్టీని నడిపింది లేదు. గెలిపించింది లేదు. తానే స్వయంగా ఓడిపోయారు. ఇప్పుడు అచ్చెన్నాయుడుకు పదవి కట్టబెట్టడం ద్వారా బీసీ వర్గాలకు పదవి ఇచ్చామని చెప్పుకోవడం తప్ప అదనంగా వచ్చే ప్రయోజనం ఉండకపోవచ్చు.
జగన్ ప్రభుత్వం సంచలనమైన రీతిలో బీసీ వర్గంలోని వివిధ కులాల వారికోసం 56 కార్పొరేషన్లు పెట్టి, పదవులు ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గాలలో మరీ వెనుకబడి పోకుండా ఉండడం కోసం అచ్చెన్నాయుడు పేరును ప్రకటించవలసి వచ్చినట్లుంది.
అంతేకాక జగన్ తన మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేయడం, నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు ఆ వర్గాలేక కేటాయించడం ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకుంటున్నారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు ఏపీ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించకుండా అచ్చెన్న భుజంపై తుపాకి పెట్టే యత్నం చేశారనుకోవాలి.
నిజానికి లోకేష్‌కు ముఖ్యమంత్రి జగన్‌ను ఎదుర్కునే సత్తా ఉందని చంద్రబాబు భావించి ఉన్నట్లయితే ఆయనకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగించేవారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు తాను జాతీయ పార్టీ అద్యక్షుడినని చెప్పుకున్నా, తన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ప్రకటించుకున్నా, వారు కేవలం ఏపీకే పరిమితం అయ్యారన్నది వాస్తవం.
తెలంగాణలో పార్టీని ఎప్పుడో వదలివేశారు. కేవలం నామమాత్రంగా మాత్రమే పార్టీని నడుపుతున్నారు. అలాంటప్పుడు లోకేష్‌ను పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ప్రకటించి ఉన్నట్లయితే, పార్టీలో కొంతమందికైనా ఒక విశ్వాసం కలిగేదేమో! ఆ పని చేయలేకపోయారు.
అచ్చెన్నాయుడు కూడా తన తొలి మీడియా సమావేశంలో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రకటించుకున్నారు. అంటే దాని అర్థం లోకష్ పేరు ప్రకటిస్తే నష్టం జరుగుతుందని అనుకోవాలి. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి చంద్రబాబుకు దాదాపు డ్బ్బై ఐదేళ్లు వస్తాయి.
అయినా ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని అచ్చెన్నాయుడు చెబుతున్నారంటే, ఆ తర్వాత స్థానంలో ఉన్న లోకేష్ సమర్థతపై ఏర్పడిన అపనమ్మకం అనుకోవాలి. అయితే చంద్రబాబే ఇంతవరకు తన కుమారుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించలేదు కనుక అచ్చెన్నాయుడు కూడా చేయగలిగింది లేదనుకోవాలి.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి లోకేష్‌ను మంత్రిగా తీసుకోవాలని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావడం, దాంతో ఆయన తప్పనిసరి స్థితిలో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిన విషయమే. ఆ రోజులలో టీడీపీ నేతలు తదుపరి ముఖ్యమంత్రి లోకేష్ అని చెప్పేవారు.
ప్రచారం చేసేవారు. అంతేకాదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవహారాలలో ఎక్కువగా లోకేష్ జోక్యం చేసుకునేవారని అంటారు. అయినా చంద్రబాబు ఏమీ మాట్లాడేవారు కారు. తద్వారా లోకేషే సూపర్ సీఎం అన్నట్లుగా టీడీపీలో ఉండేది. కాని ఇప్పుడు మాత్రం లోకేష్‌కు బాధ్యత అప్పగించడానికి ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు.
బహుశా మంగళగిరిలో లోకేష్ ఓటమి కూడా ఒక కారణం కావచ్చు. అలాగే లోకేష్ ప్రసంగాలలో పెద్దగా పస ఉండదన్న భావన ఉంది. అలాగే లోకేష్ ట్వీట్లు కూడా అర్థవంతంగా కనిపించవు. హేతుబద్ధమైన విమర్శలు కాకుండా తండ్రి మాదిరే అసత్య విమర్శలేక ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారని అనుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో మూలాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ సొంతంగా జనంలో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.
ఏపీలో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేయడమే కాకుండా, పార్టీని తానే సొంతంగా నడుపుకుంటూ ప్రజలను ఆకట్టుకున్నారు. మరి లోకేష్ ఎందుకు అలా చేయలేకపోతున్నారన్న ప్రశ్న టీడీపీ వర్గాలలో వస్తోంది. చంద్రబాబుకు ఇవన్ని సమస్యలే.
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా పెట్టి లోకేష్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి చంద్రబాబు అమలు చేసిన వ్యూహం పార్టీలో ఉన్నవారందరికి తెలిసిందే. కాని ప్రస్తుతం ఆ రిస్కు చేయడానికి వెనుకాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు అగమ్యగోచర పరిస్థితి ఎదురు అవుతోంది.
బీసీ వర్గానికి చెందిన నేతను పార్టీ అధ్యక్షుడిని చేశామని చెప్పుకోవడమే తప్ప మరో ఉపయోగం ఉంటుందా అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్‌లో చిక్కుకుని జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ కేసులో అరెస్టు అవడమే అర్హత అవుతుందా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.
అచ్చెన్నాయుడు గతంలో జగన్‌ను నోటికి వచ్చినట్లు దూషించేవారు. బహుశా అది కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయి ఉండాలి. లేకుంటే అచ్చెన్నాయుడు సోదరుడు దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు ప్రముఖంగా ఈ పదవికి ప్రస్తావనకు వచ్చింది. కాని ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అచ్చెన్నాయుడుకు ఇవ్వక తప్పలేదని అంటున్నారు.
బీసీ కులాల కార్పొరేషన్ల ద్వారా సుమారు 700 మందికి పైగా జగన్ పదవులు ఇస్తే, వాటికి పెద్ద విలువ ఏమి ఉంటుందంటున్న అచ్చెన్నాయుడు, తన ఒక్కరికి పార్టీ పదవి ఇస్తే, బీసీలు అందరికి ప్రయోజనం జరిగినట్లు బిల్డప్ ఇచ్చుకునే యత్నం చేశారు. కానీ వాస్తవం ఏమిటో తెలుసు. గత అధ్యక్షుడు కళా వెంకటరావుకు ఎంత గౌరవం దక్కిందో తెలియంది కాదు.
ఇప్పుడు అంతకు మించి తనకు వచ్చేది లేదన్న సంగతి అచ్చెన్నకు తెలియకుండా పోదు. పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు కనుక అచ్చెన్నకు ఆ పదవి కేటాయించారనుకోవచ్చు. నిజంగానే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటే లోకేష్‌నే తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉండేది.
ఇక తెలంగాణలో ఎల్.రమణను కొనసాగించడం కూడా బలహీనతే. ఈ మధ్యే కొందరు టీడీపీ తెలంగాణ నేతలు రమణను మార్చాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణపై పూర్తిగా ఆశలు వదలుకున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తూతూ మంత్రంగా టీడీపీని నడిపిస్తున్నారన్నది అర్థం అవుతూనే ఉంది.
ఏపీలో పార్టీని నిలబెట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్‌ను నేరుగా రంగంలోకి దించే రిస్కు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థ్దకమే అవుతుందా?
కొమ్మినేని శ్రీనివాసరావు