ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డిఎ బకాయిలు ఇచ్చారు ఆంధ్ర సిఎమ్ జగన్. అబ్బో.సూపరే అనుకున్నారు. నిజానికి ఈ డిఎలు ఎప్పటి నుంచో బకాయి పడి వున్నవి. ఈ మూడు ఒకేసారి ఇచ్చి వుంటే నిజంగా సూపరే. కానీ జగన్ ఇప్పుడు ఇచ్చిందేమిటి? అంటే ఏమీ లేదు. నిజంగానే ఈ దసరాకు ఇచ్చిన కానుక ఏమీ లేదు.
మూడు డిఎ లలో ఒకటి వచ్చే ఏడాది అంటే 2021 ఫిబ్రవరి 1న అందుతుంది. అంటే నాలుగు నెలల తరువాత. మరో డిఎ 2021 మధ్యలో అందుతుంది. అంటే దాదాపు మరో ఎనిమిది నెలల తరువాత. ఆపై డిఎ 2022 లో అంటే రెండేళ్లు తరువాత అందుతుంది.
మరి ఈ దసరాకు ఉద్యోగులకు జగన్ ఏమిచ్చినట్లు? కనీసం 26 ను సెలవుగా (తెలంగాణలో మాదిరిగా) కూడా ప్రకటించలేదు. సరే ఆ సంగతి అలా వుంచితే ఏనాటి బకాయిలో మూడు ఇప్పుడు ఎప్పుడు ఇచ్చేదీ ప్రకటించారు. సరే, కానీ మూడు బకాయిలు తీరేలోగా మరో అరడజను డీఎలు కేంద్రం ఇస్తుంది.
ఇక అవి బకాయి పడతాయి. అంటే ఇక ఈ డిఎ బకాయిలు మూడు లేదా నాలుగు అలా వుంటూనే వుంటాయి అన్నమాట. ఈ మాత్రం దానికి జగన్ ఇచ్చిన పండగ కానుక అని అనుకోవడం దేనికో?