ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విధించిన భారీ ఫైన్లపై తెలుగుదేశం పార్టీ లేనిపోని విమర్శలు గుప్పిస్తోంది. సినిమా డైలాగులు చెబుతోంది. ఈ విమర్శల్ని మంత్రి పేర్ని నాని కూడా సినిమా స్టయిల్ లోనే తిప్పికొట్టారు.
భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఇలానే భారీ ఫైన్లు విధిస్తాడు. ఆ సినిమాను జగన్ చాలా సార్లు చూసినట్టున్నారంటూ టీడీపీ సెటైర్లు వేస్తోంది. దీనిపై నాని సీరియస్ గా స్పందించారు.
“ముందు గుంతలు బాగుచేయండి, తర్వాత ఫైన్లు వేయండంటూ టీడీపీ వాళ్లు సెటైరిక్ గా మాట్లాడుతున్నారు. గుంతలకు, ఫైన్లకు సంబంధం ఉందా? గోతులుంటే అడ్డగోలుగా బండి తోలవచ్చా, లైసెన్స్ లేకుండా తోలవచ్చా. ఇవన్నీ టీవీ ప్రొగ్రామ్స్ లో హాస్యం పండించడానికి బాగుంటాయి, కానీ వాస్తవ పరిస్థితి అర్థంచేసుకోవాలి.
జగన్, భరత్ అనే నేను సినిమాను 4-5 సార్లు చూసినట్టు ఉన్నారని, అందుకే ఈ ఫైన్లు పెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ సినిమా చూసినప్పుడు మాత్రం చప్పట్లు కొడతారు. ఈరోజు జగన్ అదే పని చేస్తే విమర్శిస్తున్నారు.”
కేవలం ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వాళ్లపై ఉక్కుపాదం మోపడం కోసమే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు నాని. ముఖ్యమంత్రి జగన్ కు ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిపిన నాని.. రోడ్లు సరిచేయడానికి ఆల్రెడీ 2500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభమౌతాయని స్పష్టంచేశారు.