‘కాపు’ శ‌త్రువులెవ‌రు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీసీల త‌ర్వాత అత్య‌ధిక జ‌నాభా కాపుల‌దే. కానీ కాపులెవ‌రూ రాజ్యాధికారాన్ని చేప‌ట్ట‌లేక‌పోయారు. ఇది ఆ సామాజిక వ‌ర్గాన్ని తీవ్రంగా బాధించే విష‌యం. కేవ‌లం నాలుగైదు శాతం జ‌నాభా ఉన్న క‌మ్మ‌, రెడ్డి సామాజిక…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీసీల త‌ర్వాత అత్య‌ధిక జ‌నాభా కాపుల‌దే. కానీ కాపులెవ‌రూ రాజ్యాధికారాన్ని చేప‌ట్ట‌లేక‌పోయారు. ఇది ఆ సామాజిక వ‌ర్గాన్ని తీవ్రంగా బాధించే విష‌యం. కేవ‌లం నాలుగైదు శాతం జ‌నాభా ఉన్న క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే విడ‌త‌ల వారీగా అధికారాన్ని చెలాయిస్తున్నారు. వాళ్ల అధికార ప‌ల్ల‌కీల‌ను మోసే బోయీలుగా మాత్ర‌మే మిగిలిపోతున్నామ‌నే ఆవేద‌న కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల్లో క‌నిపిస్తుంది. తామెందుకు అధికారానికి ద‌గ్గ‌ర కాలేక‌పోతున్నాం? ఎందుకిలా జ‌రుగుతోంది?  లోపం ఎక్క‌డ‌? అనేది కాపు నేత‌ల‌కు ఒక ప‌ట్టాన అర్థం కావ‌డం లేదు.

త‌మ‌ను అధికారానికి చేరువ కాకుండా అడ్డుకుంటున్న శ‌క్తులేవి? శ‌త్రువులెవ‌రు? అనేది మొద‌ట‌గా కాపు సామాజిక వ‌ర్గం నేత‌లు ఆలోచించాలి. కాపుల‌కు కాపులే శ‌త్రువులంటే అతిశ‌యోక్తి కాదేమో! వంగ‌వీటి రాధాను చూసిన త‌ర్వాత కూడా కాపుల‌కు జ్ఞానోద‌యం కాక‌పోతే, వాళ్లను దేవుడే కాపాడాలి. ఎందుకంటే తాము ఆరాధ్య దైవంగా భావించే వంగ‌వీటి రంగాను అత్యంత దారుణంగా హ‌త్య చేసిందెవ‌రో చిన్న పిల్ల‌ల్ని అడిగినా చెబుతారు. తాము ఆశాదీపంగా భావించే వంగ‌వీటి రంగాను హ‌త్య చేయ‌డంతో ఆ సామాజిక వ‌ర్గ రాజ్యాధికార ఆశ‌ల్ని కూడా మొగ్గ‌ద‌శ‌లోనే ఉసురు తీసిన‌ట్టైంది.

రంగా హ‌త్య‌తో కాపుల‌కు జ‌రిగిన న‌ష్టం అంతాఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న సోద‌రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజకీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ కాపుల ఆశ‌యాల్ని నెర‌వేర్చ‌లేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల కాపు సామాజిక వ‌ర్గ ప్ర‌ముఖులు హైద‌రా బాద్‌లో స‌మావేశం కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామంగా చెప్పొచ్చు. రాజ‌కీయాలంటే సినిమాల్లో హీరో పాత్ర‌లు వేసేంత ఈజీ కాదు. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను దీటుగా ఎదుర్కోవాలంటే చాలా మ‌నోబ‌లం ఉండాలి. విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకున‌గ‌లిగే గుండె నిబ్బ‌రం ఉండాలి. మెగాస్టార్ చిరంజీవికి ఆ విష‌య‌మై జ్ఞానోద‌యం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

దీంతో త‌న‌ను తాను మోసం చేసుకోలేక‌, అలాగే త‌న‌ను న‌మ్ముకున్న సామాజిక వ‌ర్గాన్ని వంచించ‌లేక రాజ‌కీయాల నుంచి గౌర‌వంగా త‌ప్పుకుని మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యం అట్లా లేదు. త‌న వ్య‌క్తిగ‌త ఈర్ష్యా అసూయ‌ల‌ను మొత్తం సామాజిక వ‌ర్గానిద‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ప‌వ‌న్ త‌న‌ను నాయ‌కుడిగా నిరూపించుకోవాల‌నే త‌ప‌న కంటే, మ‌రెవ‌రిపైన్నో ప్ర‌తీకారం తీర్చుకునేందుకే రాజ‌కీయాల్లో ఉన్నాన‌నే సంకేతాల్ని పంపారు. అందుకే గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌నీసం తాను నిలిచిన రెండు చోట్ల కూడా గెల‌వ‌లేక‌పోయారు.

ఇలాంటి రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గేతరుల‌ను క‌లుపుకుని రాజ్యాధికారాన్ని సాధించే దిశ‌గా కాపు నేత‌లు వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఇది మంచి ప‌రిణామ‌మే. అయితే వంగ‌వీటి రాధా వ్య‌వ‌హార‌శైలి మాత్రం త‌మ సామాజిక వ‌ర్గానికి తీర‌ని న‌ష్టం క‌లిగించేలా ఉంద‌ని కాపులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న హ‌త్య‌కు రెక్కీ నిర్వ‌హించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం, ఆ త‌ర్వాత సినిమాటిక్‌గా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం రాధాపై అసంతృప్తి క‌లిగిస్తోంద‌ని సొంత సామాజిక వ‌ర్గ నేత‌లే అంటున్నారు.

తండ్రిని చంపించిన పార్టీకి చెందిన నేత‌లొచ్చి ప‌రామ‌ర్శించ‌డం, పైగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తా మ‌న్న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం దేనికి నిద‌ర్శ‌న‌మ‌నే నిల‌దీత‌లు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వంగ‌వీటి రాధాకు ప్ర‌త్యేకంగా చ‌రిష్మా లేద‌ని, ఆయ‌న తండ్రి ఇమేజ్‌తో నెట్టుకొస్తున్నార‌ని కాపు సామాజిక వ‌ర్గ నేత‌లు చెబుతున్నారు. రంగాను అంత‌మొందించిన వాళ్ల‌తో ఆయ‌న త‌న‌యుడు చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతున్నార‌ని, ఇది త‌మ సామాజిక వ‌ర్గం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తోంద‌ని వాపోయే వాళ్లు లేక‌పోలేదు.

కాపు సామాజిక వ‌ర్గం ఆరాధించే నాయ‌కుడిని చంపిన వాళ్ల‌తో కుటుంబ స‌భ్యులే అంట‌కాగుతుంటే, ఇక ఎవ‌రితో తాము పోరాడాల‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. క‌మ్మ‌, రెడ్డి సామాజికేత‌ర‌ వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోయేలా రాజ‌కీయాలు చేయా ల్సిన స‌మ‌యంలో మ‌రోసారి, వాళ్ల రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం రాధా పావు కావ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. అస‌లు త‌న రాజ‌కీయ పంథా ఏంటో త‌న‌కైనా అర్థ‌మ‌వుతున్న‌ట్టు లేద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వంగ‌వీటి రంగా నిజ‌మైన వార‌సుడు వంగ‌వీటి న‌రేంద్రే అని మ‌రికొంద‌రు చెబుతున్నారు. అందుకే త‌న బాబాయి రంగా హంత‌కుల విష‌యంలో న‌రేంద్ర రాజీలేని పోరాటం చేస్తున్నార‌ని వంగ‌వీటి రాధా-రంగా మిత్రులు చెప్పుకొస్తున్నారు. చివ‌రికి త‌మ్ముడు రాధాతో విభేదించి బీజేపీలో కొన‌సాగుతూ రాధా-రంగా అభిమానుల‌కు ద‌న్నుగా నిలిచార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా వంగ‌వీటి రాధా త‌న సామాజిక వ‌ర్గానికి ప్ర‌యోజ‌నం క‌లిగించే మాట ప‌క్క‌న పెట్టి, న‌ష్టం చేసేలా వ్య‌వ‌హ‌రించ‌కుంటే అదే ప‌దివేల‌ని కాపు నేత‌లు కోరుకుంటున్నారు. త‌న తండ్రి హ‌త్య‌నాటి ప‌రిస్థితుల‌ను ఒక‌సారి తెలుసుకుని రాధా రాజ‌కీయంగా అడుగులు వేస్తే మంచిద‌ని కాపు నేత‌లు హిత‌వు చెబుతున్నారు.