మమ్మల్ని గెలిపించండి.. యాభై రూపాయలకే చీప్ లిక్కర్ ఇచ్చేస్తాం.. అని మాట్లాడిన బీజేపీ ఏపీ అద్యక్షుడు సోము వీర్రాజు అదే రోజున మరికొన్ని అమూల్యమైన మాటలు కూడా మాట్లాడారు. వెటకారం కాదులెండి.. నిజంగానే గొప్ప మాటలు. తమని అధికారంలో కూర్చోబెడితే.. మూడు నెలల్లో అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేస్తాం అన్నారు. అలాగే.. పోలవరం సంగతి కూడా తేలుస్తాం.. అని ఏదో కాకుల లెక్కలు చెప్పారు.
అధికారానికి ముడిపెట్టి అమరావతి హామీలు ఇవ్వడం తరువాత.. ముందు పోలవరానికి ఇవ్వాల్సిందంతా ఇవ్వండి. అనుమతులు రూపంలో అడ్డుపడకుండా.. దానిని పూర్తి కానివ్వండి.. అప్పటికి గానీ మీ మాటలు నమ్మలేం అని తెలుగు ప్రజలు బీజేపీకి సవాలు విసురుతున్నారు. పోలవరం అథారిటీ కొత్త కొర్రీలతో జాప్యం చేస్తున్న తరుణంలో ఈ ప్రశ్న తలెత్తుతోంది.
ఏపీ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పుష్కలంగా వ్యతిరేకత ఉండగా.. ఇటు ప్రజలకు ఆశావహంగా కనిపిస్తున్న ప్రత్యామ్నాయ పార్టీ లేకుండా పోయిందని బీజేపీ అనుకుంటున్నది. అలాంటి భ్రమల్లోంచే .. వారికి ఈ రాష్ట్రంలో తాము ఏదో ఒకనాటికి అధికారంలోకి రాగలమనే ఆశ కూడా పుడుతున్నది. అప్పనంగా దక్కేట్లయితే అధికారం అందుకోవాలనేది వారికోరిక.
అంతే తప్ప.. అధికారంలోకి వచ్చేలాగా.. ఈ రాష్ట్రం కోసం ఏమైనా చేయాలని.. కేంద్రంలో ఎటూ తమ పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. అటునుంచి.. రాష్ట్రానికి వరాలజల్లు కురిపించి.. తద్వారా తమ పార్టీ పట్ల ప్రజల్లో అభిమానాన్ని పెంచాలనే ప్రయత్నం ఇసుమంతైనా చేయడం లేదు. దానికి తోడు.. రాష్ట్రానికి ఇచ్చి తీరవలసిన నిధులు, అనుమతుల విషయంలో కూడా కేంద్రం నాటకాలు ఆడుతోంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి.
తాజా పరిణామాలను గమనిస్తే.. పోలవరం ప్రాజెక్టు అనేది ఈ జీవితకాలానికి పూర్తిఅయ్యే అవకాశమే లేకుండా.. కేంద్రం, దాని పరిధిలోని సంస్థలు మోకాలడ్డుతున్న వైనం గమనిస్తే.. ఏపీ మీద ఏదో కక్ష సాధిస్తున్నట్టుగా ప్రజలకు అనుమానం కలుగుతోంది.
కేంద్రం ప్రత్యేకహోదా ఎటూ ఇవ్వదు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను దాటిపోతుందని భయం. అది ఇవ్వరు సరే.. ఎటూ చాలా వరకు నిధులు ఖర్చుపెట్టేసిన, పనులు కూడా పూర్తయిన పోలవరం విషయంలో అవాంతరాలు సృష్టిస్తోంది. 47వేల కోట్ల పైచిలుకు సవరించిన అంచనాలకు ఇప్పట్లో అనుమతులు వచ్చే అవకాశమే లేకుండా.. కేంద్రం కొత్త కొర్రీలు పెడుతుండడం విశేషం. గతంలో అన్నీ అందజేసిన సమాచారాలే.. కానీ.. మళ్లీ కొత్తగా లేటెస్ట్ అప్ డేట్స్ తో సేకరించి పంపాలని అనడం.. ఒకరకంగా వేధింపులాగా కనిపిస్తోంది.
ఏపీలో మేమే అధికారంలోకి వచ్చేస్తాం అని బీరాలు పలకడం, ఎగస్ట్రా బిల్డప్ లు ఇవ్వడం కాదు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అవాంతరాలను తొలగింపజేయగలగాలి. విభజన సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు మొత్తం కేంద్రం భరిస్తుందన్న మాట అమలులో ఇవాళ్టికీ అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులనూ తామే ఏర్పాటు చేస్తామని కూడా విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది.
కానీ.. ఇప్పుడు అదంతా పెద్ద డ్రామాగా తేలుతోంది. అనుమతులే ఇవ్వకుండా.. అనుమతులకు దరఖాస్తులను పదేపదే వివరణల పేరిట వెనక్కిపంపుతున్న నాటకాలను ఆపించలేకపోతే.. ఏపీలో బీజేపీ నేతలకు పుట్టగతులు ఉండవనే సంగతి వారు తెలుసుకోవాలి. ప్రస్తుతం కనీసం ప్రజాగ్రహ సభలు పెట్టగలుగుతున్నారు. కేంద్రం ఇలాగే చేస్తోంటే.. ఏపీలో చిన్న సభ పెట్టినా ప్రజలు తరిమికొడతారు.