Advertisement

Advertisement


Home > Politics - Gossip

ది గ్రేట్ లాయర్..డిటెక్టివ్..అండ్ మోటివేటర్

ది గ్రేట్ లాయర్..డిటెక్టివ్..అండ్ మోటివేటర్

కొందరు వుంటారు. వాళ్లు మల్టీ టాలెంటెడ్. కొందరు కొన్ని కళల్లోనే ఆరితేరగలరు. లక్షల్లో ఒకరు మాత్రమే సకల కళా వల్లభన్ అనిపించుకుంటారు. ఇది వారి పూర్వ జన్మ సుకృతం. అందుకే 'ఆయన' ఆ లెవెల్ కు ఎదగగలిగారు. 'ఆ సంస్థ'లో అందరు పని చేసినా, ఏ ఒక్కరూ ఆ సంస్థనే 'కొనేసేంత' లెవెల్ కు ఎదగలేదు. ఆ సంస్థకు ఎందరు వారసులున్నా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. 

ఇప్పుడు ఆయనే మన సకలకళా వల్లభన్. మచ్చుకు కొన్ని కళలు ఈ రోజు రాసిన తన స్టయిల్ రెగ్యులర్ అక్కసు మాదిరి అక్షరాల్లో తొంగిచూసాయి. అవి ఎలా...చూద్దాం.

గ్రేట్ లాయర్

సిబిఐ బుర్ర బద్దలు కొట్టుకొంటోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మోటివ్ అనగా కీలక కారణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎవరు చంపారు లేదా చంపి వుంటారు..లేదా చంపించి వుంటారు అన్నది ఏ హత్య కేసులో అయినా ఎంత కీలకమో, ఎందుకు చంపించి వుంటారు అన్నది కూడా కీలకమే. 

ఇప్పుడు ఈ పాయింట్ నే మహా మేధావి కనిపెట్టారు. ఎప్పుడో వైఎస్ వివేకా-వైఎస్ జగన్ మాట్లాడుకున్నారట. ఏమని? ఎంపీగా పోటీ చేస్తే నువ్వు చేయాలి. లేదా నేను చేయాలి. ఇంకెవరు వద్దు అని. కానీ ఈ మాటను కాదని వైఎస్ అవినాష్ రెడ్డిని దింపారు జగన్. 'ఇలా ఈ ఇద్దరు' మాట్లాడుకున్న మాటలను 'సోదరి షర్మిల' విన్నారు. ఇప్పుడు ఆ మాటలనే ఆమె 'మౌఖికంగా' సిబిఐ కి చెప్పారు. ఇలా సిబిఐ కి చెప్పడాన్ని 'ఈయన' విన్నారు.

ఇలా అవినాష్ రెడ్డిని వైఎస్ వివేకా వ్యతిరేకించారు కనుక, అదే హత్యకు మోటివ్ అని ఈ గ్రేట్ లాయర్ ఎస్టాబ్లిష్ చేసేసారు. వైఎస్ వివేకా-జగన్ మాత్రమే మాట్లాడుకున్నది షర్మిలకు ఎలా తెలుసో, షర్మిల సిబిఐకి మౌఖికంగా మాత్రమే చెప్పారన్నది ఈయనకు ఎలా తెలుసో అన్నది 'గాలి రాతలకే' వదిలేద్దాం. కానీ చిన్న సందేహం. వైఎస్ వివేకా వద్దన్నా అవినాష్ కు పదవి ఇచ్చాక, ఇంక మర్టర్ ఎందుకు? వైఎస్ వివేకా అడ్డంగా వుంటే కదా మర్డర్ చేయాల్సింది?  ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో? 

గ్రేట్ డిటెక్టివ్

ఇక 'ఈయన' గ్రేట్ డిటెక్టివ్ లక్షణాలు చూద్దాం. అన్మచెల్లెలు జగన్-షర్మిల క్రిస్మస్ కు ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నారు. తన వాటా ఆస్తి తనకు ఇవ్వాలని అన్నను డిమాండ్ చేసారు. ఇడుపులపాయ అతిథి గృహంలో సోదరుడు జగన్‌రెడ్డితో గొడవపడ్డారు.

‘‘నాకు అన్యాయం చేస్తే ఆ దేవుడు నీకు కూడా నష్టం చేస్తాడు.. నీవు పోగేసుకున్న సంపద నీకు దక్కకుండా ఆ దేవుడే చూసుకుంటాడు’’ అని ఆ సందర్భంగా ఆమె సోదరుడికి శాపనార్థాలు పెట్టిసారు.  ‘‘తెలంగాణలో నేను రాజకీయంగా బలపడకుండా అడ్డుకుంటావా? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నిన్ను కూడా బలహీనపరుస్తాను’’ అని సోదరుడిని హెచ్చరించారు.

'ఆ ఇద్దరు' మాట్లాడుకున్నది షర్మిల 'ఈయన'తోనో, మరెవరితోనో చెబితే బయటకు రావాలి. జగన్ ఎలాగూ చెప్పరుకదా? మరి ఇలా షర్మిల సమాచారం ఈయనకు చేరింది అంటే ఎంత గ్రేట్ డిటెక్టివ్ అనుకోవాలి. 

కేవలం షర్మిల విషయంలోనే కాదు ఈయన 'గూఢచర్యం'. ఇంకా వుంది. 

ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవిలో వున్న ప్రధాన న్యాయమూర్తి, ఈ రాష్ట్రపు అత్యన్నత పదవిలో వున్న వైఎస్ జగన్ ఆంతరింగక సమావేశం జరిగింది.

ఆ సమావేశంలో ''‘‘నిజానికి సారీ అని చెప్పడం చాలా చిన్న పదం. నేను చేసిన తప్పుకు సారీ అంటే సరిపోదు. కొంతమంది అప్పట్లో నన్ను తప్పుదారి పట్టించారు. వారి మాటలు నమ్మి నేను మీకు వ్యతిరేకంగా లేఖ రాశాను. పెద్ద మనసు చేసుకుని మన్నించండి’’ అని ప్రాథేయపడ్డారు. 

ఇంతకన్నా విషయ సేకరణ చేయగలగిన గొప్ప డిటెక్టివ్ ఎక్కడ వుంటారు. 

గ్రేట్ మోటివేటర్

అసలు షర్మిలను అన్నకు వ్యతిరేకంగా నడపడం కోసం 'ఈయన' ఎంతగా ప్రయత్నిస్తున్నారో చూస్తే చాలా ఈయన ఎంత గొప్ప మోటివేటర్ అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. 

ఆస్తిలో వాటా డిమాండ్ చేసి లాక్కో. తెలంగాణలో కాదు ఆంధ్రలో పార్టీ స్టార్ట్ చేయి. విశాఖ లో వైఎస్ విగ్రహావిష్కరణకు వెళ్లు..ఆంధ్రలో ఒక్కసారి అడుగుపెట్టి జగన్ ను నిలదీస్తే చాలు. మొత్తం సీన్ మారిపోతుంది. జగన్ ను జనం కుర్చీలోంచి కిందకు లాగేస్తారు. 

ఇదీ మోటివేషన్. కానీ ఈ మోటివేషన్ వెనుక వున్న మోటివ్ వేరు. మనవల్ల కానిది వేరే వాళ్లు చేసేస్తే బాగుండును అనుకునే తత్వం. షర్మిల ఏదో విధంగా జగన్ ను బదనామ్ చేసేస్తే ఆ తరవాత షర్మిలను పక్కకు తప్పించడం పెద్ద పని కాదు. ఇలా దరిద్రపు, కుళ్లు ఐఢియాలు మన తెలుగు సినిమాల్లో చాలా అంటే చాలా వాటిల్లో చూసాం. 

అంతే కాదు. ఎక్కడ 'పెద్దాయిన' పెద్ద మనసు చేసుకుని క్షమించేస్తారో. దాంతో జగన్ ఎక్కడ బయటపడిపోతారో అని మరో భయం. అందుకే...

స్వాగతసత్కారాలకు, ‘సారీ’లకు భారత న్యాయవ్యవస్థ పొంగిపోదు-, లొంగిపోదు. ప్రశంసలకు పడిపోయి విమర్శలకు కుంగిపోతే అది న్యాయవ్యవస్థ ఎలా అవుతుంది? భావోద్వేగాలకు, రాగద్వేషాలకు అతీతంగా న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్నది కూడా. జగన్‌రెడ్డిపై ఎంతటి తీవ్రమైన అభియోగాలు నమోదైనప్పటికీ ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కనుక కలుసుకోవడానికి జస్టిస్‌ రమణ అంగీకరించి ఉండవచ్చు. జగన్‌రెడ్డి ప్రస్తుతం నిందితుడు మాత్రమే. దోషిగా నిర్ధారణ కాలేదు. భారత ప్రధాన న్యాయమూర్తిని కలుసుకున్నంత మాత్రాన ఆయనపై విచారణకు వస్తున్న కేసులలో తీర్పులు తారుమారవుతాయని ఎవరూ భావించకూడదు. జగన్‌రెడ్డి కానీ, ఆయన తరఫున జస్టిస్‌ రమణతో సమావేశం ఏర్పాటు చేయించినవాళ్లు కానీ అలా భావిస్తే పప్పులో కాలేసినట్టే...''

అంటూ తనకు తానే మోటివేట్ చేసుకుంటూ, ఇదేంటి ఇలా జరుగుతోంది అని కాస్త భయపడుతున్నవారు ఎవరైనా వుంటే వారిని మోటివేట్ చేస్తున్నారు. 

కానీ గమ్మత్తేమిటంటే..ఆయన రాసిన లైన్లలోనే....''. జగన్‌రెడ్డి ప్రస్తుతం నిందితుడు మాత్రమే. దోషిగా నిర్ధారణ కాలేదు...''అని వుంది. మరి జగన్ రెడ్డి ఇంకా నిందితుడే అయినపుడు, దోషి కానపుడు, దాదాపు ఏడెనిమిదేళ్ల కాలంగా రాస్తున్న రాతలేమిటి? దాంట్లో దొర్లుతున్న పలుకులేమిటి? 

ఏమిటో ఈయన బాధే కాదు. ఈయన రాతలు కూడా అర్థం కావు. రాసిందే రాయరా అన్నట్లుగా వారం వారం రాసుకోవడం. కానీ ఈయన మిస్ అవుతున్న అసలు సిసలు లాజిక్ ఏమిటంటే, ఈయనను జగన్ కు శతృవుగా జనం ఎప్పుడో తమ మనసుల్లో ముద్రవేసేసుకున్నారు అన్నది. 

అందుకే గ్రేట్ లాయర్, డిటెక్టివ్, మోటివేటర్ అయినా, గ్రేట్ జర్నలిస్ట్ మాత్రం కాలేకపోయారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?