పాత బాధలు మరచిపోతూ కొత్త ఏడాదిలోకి సమంత

2021 సంవత్సరం హీరోయిన్ సమంతకు ఓ చేదు జ్ఞాపకం. ఆ మాటకొస్తే నాగచైతన్యకు కూడా అదో మరచిపోలేని ఏడాది. కానీ విడాకుల వ్యవహారం ఆడవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనేది మాత్రం వాస్తవం. కానీ అలాంటి…

2021 సంవత్సరం హీరోయిన్ సమంతకు ఓ చేదు జ్ఞాపకం. ఆ మాటకొస్తే నాగచైతన్యకు కూడా అదో మరచిపోలేని ఏడాది. కానీ విడాకుల వ్యవహారం ఆడవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనేది మాత్రం వాస్తవం. కానీ అలాంటి ప్రభావం నుంచి సమంత చాలా త్వరగా బయటపడింది. 

2022 కొత్త ఏడాది వచ్చేనాటికి సమంత పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోతూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. 2021ని ఓ చేదు జ్ఞాపకంగా మరచిపోతూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని సోషల్ మీడియాలో ఉంచింది.

నిజాయితీగా ఉండండి..

మీతో మీరు నిజాయితీగా ఉండండి అంటూ ఓ భావోద్వేగమైన సందేశాన్ని ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది సమంత. తన పెంపుడు కుక్కల ఫొటోని జతచేస్తూ ఈ పోస్టింగ్ పెట్టింది. 2022లో మరింత బలంగా, తెలివిగా, దయగల వ్యక్తిగా తాను ఉంటానని, తనతోపాటే అందరూ అలాంటి లక్షణాలు అలవరచుకోవాలన్నట్టుగా.. మెసేజ్ ఉంచింది. ఇక లక్ష్యాల సాధన గురించి కూడా తనదైన శైలిలో స్పందించింది శామ్.

ఈ సంవత్సరం మీరు సాధించాలనుకున్న అతి పెద్ద లక్ష్యం సుదూరంగా కనిపిస్తే, ఆ రోజుని సరిగ్గా ఎదుర్కోలేము అని మీకు అనిపిస్తే, యధావిధిగా ఉదయాన్నే నిద్ర లేవండి, సాధారణ జీవితాన్ని కూడా సంతోషంగా, పండగలా గడపండి, అలాంటి జీవన విధానం అలవరచుకోండి అనే మెసేజ్ ఉంచింది సమంత.

సమంత ప్రస్తుతం ఒంటరి, కానీ ఆమెకు స్నేహితుల సపోర్ట్ ఉంది. గతంలో కూడా సమంత తన ఒంటరితనం గురించి, తన వైవాహిక జీవితం గురించి పలు పోస్టింగ్ లతో తన బాధను, ఆవేదనను వ్యక్తపరిచింది. కొత్త ఏడాది సందర్భంగా సమంత పెట్టిన పోస్టింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమంత సినిమాలు, షికార్లు, ఇతర వ్యవహారాలతో.. ఆమె త్వరగానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్టు పైకి అనిపించినా.. లోపల మాత్రం సమంత సున్నిత భావోద్వేగాలు గల వ్యక్తిగా కనిపిస్తోంది. ప్రతి చిన్న సందర్భంలోనూ ఆమె తన ఆశల్ని, ఆశయాలను ఇలా అభిమానులతో పంచుకుంటోంది.