ఎక్కడైనా పింఛన్ పెంచకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం పోకడలు విపరీత ధోరణిలో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం తన హామీకి కట్టుబడి పింఛన్‌ను విడతల వారీగా పెంచుతూ పోతోంది. ఈ క్రమంలో ఇప్పుడు రూ.250 పెంచి…మొత్తం రూ.2,500 చేసింది. దీంతో వృద్ధులు, వితంతువులు…ఇలా 62 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి కలగనుంది.
కానీ టీడీపీకి మాత్రం ఇది నేరంగా కనిపిస్తోంది. పింఛన్ పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దారుణ వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనమే కాదు, నిరుపేదల్ని దోచుకుంటోన్న దోపిడీ దొంగగా జగన్‌ను అయ్యన్న దూషించడం గమనార్హం. పింఛన్ పెంచిన జగన్‌పై టీడీపీ అసూయ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే…అయ్యన్న తాజా ట్వీట్ చదవాల్సిందే.
‘పింఛను రూ.3 వేలకి పెంచుతామని హామీనిచ్చి గద్దెనెక్కిన ఈ 32 నెలల పాలనలో పెంచింది రూ.250 మాత్రమే. ప్రజాధనమే కాదు, నిరుపేదల్ని దోచుకుంటోన్న దోపిడీ దొంగ జగన్. 60 లక్షల మంది పింఛను లబ్ధిదారులలో ఒక్కొక్కరి నుంచి రూ.750 చొప్పున ఇప్పటి వరకూ రూ.14,400 కోట్లు కొట్టేశాడు ఏ1 జగన్. ఈ నూతన సంవత్సరంలోనైనా ఏ ఆసరాలేని అవ్వాతాతల్ని, వితంతువుల్ని, దివ్యాంగుల్ని మోసగించకుండా జగన్‌కి మంచిబుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
వైసీపీ ఎన్నికల ప్రణాళికలో పింఛన్‌ను విడతల వారీగా పెంచుకుంటూ రూ.3 వేలు అందజేస్తామని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎంతో స్పష్టంగా ఆ విషయాన్ని ఎన్నికల ముందు జగన్ చెప్పినా… కళ్లున్న కబోదుల్లా టీడీపీ విమర్శలు చేయడం వారికే చెల్లింది. జగన్ తన హామీకి విరుద్ధంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అయ్యన్న వివరించి ఉంటే బాగుండేది. అలా కాకుండా దూషణలకు దిగి తనతో పాటు పార్టీ విద్వేషాన్ని బయటికి ప్రకటించినట్టైంది.