రాజకీయాల్లో రాణించాలంటే మీడియా కీలకం. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సొంతంగా ఒక టీవీ చానల్‌ను నెలకొల్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయన సన్నాహాలు కూడా చేస్తున్నారని తెలిసింది.
ముందుగా యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసి, అనంతరం దాన్నే 24 గంటలూ కార్యక్రమాలు ప్రసారమయ్యే చానల్‌గా మార్చాలనే ఆలోచనతో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ఆయన మీడియాలో పెద్ద తలకాయలుగా పేరొందిన వాళ్లతో చర్చిస్తున్నారని సమాచారం.
మరీ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయంగా మనుగడ సాగించాలంటే ఓ మీడియా సంస్థ అవసరం ఎంతైనా వుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తనకు అప్పగించడం, 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం కావడంతో మీడియా పాత్ర కీలకమని ఆయన నమ్ముతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలకు ఆ రాష్ట్ర మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి రేవంత్‌రెడ్డిలో బలంగా ఉంది. దీంతో తానే ఒక చానల్‌ను పెడితే ఎవరినీ అడుక్కోనవసరం లేదనే భావనతో రిస్క్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీంతో వీలైనంత త్వరలో తెలంగాణలో మరో కొత్త చానల్ తెరమీదకు రానుంది.