ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు మరోసారి సమావేశం కాబోతున్నారు. గత కొన్నాళ్లుగా పెద్దగా సమావేశం కాని వీరిద్దరూ ఈ నెలలో మరోసారి సమావేశం కాబోతున్నారు. జనవరి 13వ తేదీన హైదరాబాద్ లో కేసీఆర్, జగన్ ల సమావేశం జరగబోతోందని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల విభజన వ్యవహారాల్లో పెండింగ్ అంశాల పరిష్కారానికి ఈ సమావేశం జరగబోతోందని సమాచారం.
గతంలో జగన్, కేసీఆర్ లు సమావేశమై వివిధ అంశాల గురించి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల అంశంతో పాటు ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాల గురించి వీరు చర్చించుకున్నారు. అయితే ఎందుకో కొంత గ్యాప్ వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న పలు నిర్ణయాలు తెలంగాణ సీఎంను ఇబ్బంది పెట్టాయి కూడా. అందుకో..మరెందుకో కానీ.. మధ్యలో మళ్లీ మీటింగులు జరగలేదు.
అయితే సంక్రాంతి సమయంలో మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సమావేశం కాబోతున్నారు. ఇటీవల జగన్ తీసుకున్న పలు నిర్ణయాలు కేసీఆర్ పై ఒత్తిడి పెంచాయి. తెలంగాణ ప్రజల్లో కూడా జగన్ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ చేయని, చేయనంటూ భీష్మించుకున్న పలు అంశాలను జగన్ చేసి చూపించారు. ఇది ప్రజల్లో చర్చనీయాంశంగా నిలిచింది.