తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. హైకోర్టు అడ్డంకులన్నింటినీ క్లియర్ చేసింది కాబట్టి ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్షాల మధ్య పొత్తులు కూడా లేనట్లుగా కనబడుతోంది. అన్ని పార్టీలూ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. షరా మామూలుగానే ఈ ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు.
నూటికి నూరు శాతం మున్సిపాలిటీలను గెలుచుకోవాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా చెప్పారు. ఎక్కడైనా ఓటమి ఎదురైతే సంబంధిత మంత్రుల పదవులు ఊడిపోతాయని కూడా హెచ్చరించారు. కేసీఆర్ ఎన్నికల బాధ్యత అంతా కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. తాను ప్రచారం కూడా చేయనని చెప్పారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ప్రతిపక్షాలకు పరీక్షగా మారలేదు.
టీఆర్‌ఎస్‌కు, ప్రత్యేకించి వ్యక్తిగతంగా కేటీఆర్‌కు పరీక్షగా మారాయి. ఈ ఎన్నికలను మున్సిపల్ ఎన్నికలే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి అవకాశంలేదు. ఎందుకంటే త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు మంత్రులు, నేతలు కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతాడని బహిరంగంగానే చెప్పారు. ఈ ప్రచారం జోరుగా సాగుతున్నా ముఖ్యమంత్రి ఖండించిన దాఖలాలు కనబడలేదు.
వైకుంఠ ఏకాదశినాడు తిరుమలకు వెళ్లిన కేటీఆర్‌కు అక్కడ అధికారులు, వైకాపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అదే రోజు స్వామి దర్శనం కోసం వెళ్లిన మంత్రి హరీష్‌కు రావు విషయంలో ప్రొటోకాల్ పాటించకుండా అవమానించారు. ఇద్దరూ సమాన హోదా, సమాన ప్రొటోకాల్ ఉన్న మంత్రులే అయిన్పటికీ తేడా చూపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు కేటీఆర్‌ను కాబోయే ముఖ్యమంత్రిగానే భావిస్తూ ఆ స్థాయి ప్రొటోకాల్ అమలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. సో…కాబోయే ముఖ్యమంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సెంట్‌పర్సెంట్ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గెలిపించుకోవల్సిన బాధ్యత మంత్రుల కంటే కేటీఆర్ మీద ఎక్కువగా ఉంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, లక్ష్మణ్ నేతృత్వంలోని కాంగ్రెసు, బీజేపీ చతికిలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో ఈ రెండు పార్టీలు గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నప్పటికీ ఘన విజయం సాధించే సీన్ ఉండదు. ఈ రెండు పార్టీలు ఘన విజయం సాధించకపోయినా ఉత్తమ్‌కు, లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా నష్టం కలగదు.
ఎందుకంటే ఈ ఇద్దరి పదవీకాలం ముగింపుకు వచ్చింది. ఈ రెండు పార్టీలకు అధ్యక్షులను నిర్ణయించాల్సివుంది. దానిపై ఆ పార్టీల్లో కసరత్తు సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు కాగానే పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ ఆల్రెడీ చెప్పేశాడు. కాబట్టి ఎన్నికల్లో పరాజయం కాంగ్రెసు, బీజేపీ అధ్యక్షుల మీద ప్రభావం చూపించదు. పరాజయం కారణంగా వారి పదవులకు ఎసరొచ్చే లేదా పరువు పోయే ప్రమాదం లేదు.
కాని మంత్రి కేటీఆర్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ చేశారు కాబట్టి కేసీఆర్ ఆశించినవిధంగా ఫలితాలు రాకపోతే కేటీఆర్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. మంత్రి పదవికి ఢోకా ఉండదుగాని, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం జరిగింది కాబట్టి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఆశించిన విధంగా ఫలితాలు రాకుంటే 'కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్' అనే ప్రచారం జోరు తగ్గుతుందేమో…! రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు, 10 మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో 20 చోట్ల టీఆర్‌ఎస్‌కు కాంగ్రెసు, బీజేపీతో తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్ నాయకలు కూడా ఈ సంగతి చెబుతున్నారు.
హైదరాబాద్ శివార్లలో ఉన్న మహేశ్వరం, మేడ్చల్, మల్కాజ్‌గిరిలలో, బీజేపీ ఎంపీలున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలలో టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నాయకుల మధ్య తగాదాలున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలున్నాయి. టీఆర్‌ఎస్‌లో రెబెల్స్ సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ అడ్డంకులన్నీ కేటీఆర్ అధిగమించి ఘన విజయం సాధించాల్సివుంటుంది.