అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఓ మేజర్ ఈవెంట్ పూర్తిచేశాడు బన్నీ. అది పూర్తయిన వెంటనే మీడియా ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టాడు. ఇప్పుడు తనకు ముఖ్యమైన మల్లూవుడ్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు. అక్కడ కూడా ఓ కార్యక్రమాన్ని భారీగా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అల్లు అర్జున్.
మల్లూవుడ్ లో బన్నీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలు కేరళలో కూడా బాగా ఆడతాయి. అందుకే తన కొత్త సినిమాకు కేరళలో కూడా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. అలా అని ఓ భారీ కార్యక్రమం పెట్టేంత టైమ్ లేదు. అందుకే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో భారీ ప్రెస్ మీట్ పెట్టి, దానికి మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ప్రత్యేక అతిథిగా పిలవాలని నిర్ణయించుకున్నారు.
నిజానికి ఈ ప్లానింగ్ మొత్తం అల్లు అరవింద్ దే. మోహన్ లాల్ తో మంతనాలు సాగించే కార్యక్రమాన్ని కూడా అల్లు అరవిందే భుజానికెత్తుకున్నాడు. బన్నీ ప్రెస్ మీట్ కు మోహన్ లాల్ వస్తే కచ్చితంగా మలయాళీ ప్రేక్షకుల దృష్టి అటు మళ్లుతుంది. అలా తన సినిమాకు భారీగా ప్రచారం చేయాలని భావిస్తున్నాడు బన్నీ.
బన్నీ ప్రెస్ మీట్ కు రావడానికి మోహన్ లాల్ దాదాపు అంగీకరించాడు. ఎందుకంటే, తెలుగులో మోహన్ లాల్ కు మార్కెట్ క్రియేట్ అయింది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. పైగా మోహన్ లాల్ సినిమాలన్నీ వరుసగా తెలుగులో డబ్బింగ్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి టైమ్ లో బన్నీ ఆఫర్ కు నో చెబితే అది మోహన్ లాల్ కే ఇబ్బంది. అందుకే వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కార్యక్రమం ఏ రోజున నిర్వహిస్తారనేది రేపటికల్లా నిర్ణయిస్తారు.