మాటకొస్తే నలభయ్యేళ్ళ ఇండస్ట్రీ అని, తాను ఢిల్లీ స్థాయి జాతీయ నాయకుడిని అని చంద్రబాబు చెప్పుకుంటారు. తాను మోడీ కంటే కూడా సీనియర్ని అని కూడా అంటారు. అటువంటి చంద్రబాబుని జాతీయ నాయకుడిగా గుర్తించడం మాట దేముడెరుగు. ఆయన పక్కా జాతి నాయకుడని అంటున్నారు. కేవలం తన సొంత సామాజికవర్గం కోసం పనిచేసే నేత అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు టీడీపీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్నాయని. టీడీపీ విజయాల్లో, బాబును పలు మార్లు ముఖ్యమంత్రిని చేసే విషయంలో ఈ మూడు జిల్లాల పాత్ర ఎంతో ఉందని ఆయన అంటున్నారు.
అటువంటి ఉత్తరాంధ్రను ఒక్క దెబ్బకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని గుడివాడ మండిపడుతున్నారు. విశాఖ రాజధాని వద్దు అనడమే కాదు, తన సొంత ప్రయోజనాలు, తామూ, తమ వారు కొనుక్కున్న భూములను కాపాడుకోవడమే బాబుకు ఇపుడు పరమ లక్ష్యమైపోయిందని కూడా గుడివాడ అంటున్నారు.
అమరావతి రాజధాని మూడుగా మారితే ఎక్కడ తమ భూములకు విలువ పడిపోతుందోనని బాబు భయంతోనే దీక్షలు, ఉద్యమాలు అంటున్నారని కూడా ఆయన నిందిస్తున్నారు.
మొత్తానికి బాబు ప్రాంతీయ నాయకుడు, ఉప ప్రాంతీయ నాయకుడు నుంచి గల్లీ నాయకుడైపోయారని, అమరావతి వీధుల్లో తిరుగుతూ రైతులను, జనాలను రెచ్చగొడుతున్నారని గుడివాడ గట్టిగానే తగులుకుంటున్నారు.
ఏపీలో పదమూడు జిల్లాలను అభివ్రుధ్ధి చేయాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యమైతే కేవలం తానూ, తన ప్రాంతం మాత్రమే బాగుపడాలన్న స్వార్ధం చంద్రబాబుదని ఆయన నిప్పులు చెరుగుతున్నారు. మరి బాబుని జాతీయ నాయకుడు అందామా, జాతి నాయకుడు అందామా తేల్చుకోమంటున్నారు.