మోకాలుకీ బోడి గుండుకు ముడి పెడుతున్నారు

 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు నడుం బిగించి  మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది.  రాజధాని గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు కూడా ఇదే తరహా ప్రతిపాదనలతో నివేదికలు ఇచ్చాయి. …

 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు నడుం బిగించి  మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది.  రాజధాని గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు కూడా ఇదే తరహా ప్రతిపాదనలతో నివేదికలు ఇచ్చాయి.  ఈ ప్రతిపాదనను ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వపరంగా మేధావులు ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారు.  మరోవైపు అమరావతి ప్రాంతం నుంచి నిరసనలు వ్యక్తం అవుతూనేఉన్నాయి.  రాజకీయ ప్రేరేపిత శక్తులు ఆ నిరసన జ్వాలలు ఎగదోస్తునే ఉన్నారు.

 ఇదిలా ఉండగా అధికార వికేంద్రీకరణ ఆలోచనలను అర్థం పర్థం లేని ఇతరత్రా వ్యవహారాలతో ముడి పెట్టడం ద్వారా…  ప్రభుత్వం మీద కొత్త అనుమానాలు రేకెత్తించడానికి,  కొత్త దురభిప్రాయాలు పెంచడానికి విపక్ష నాయకులు తమ వంతు కసరత్తు చేస్తున్నారు.  నువ్వు మాట్లాడే మాటలకు లాజిక్ లేదని వారికి స్పష్టంగా తెలిసినప్పటికీ మోకాలుకీ బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని తరలింపు వ్యవహారాన్ని అడ్డుకోవడం కేంద్రం బాధ్యత అని వారికి ముడి పెట్టే ప్రయత్నం చేశారు.  రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ,  నిర్మాణం కోసం 2500 కోట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు తరలిస్తామని అంటే ఒప్పుకోరని సోమిరెడ్డి జోస్యం చెబుతున్నారు.  తద్వారా కేంద్రాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.  రాష్ట్రానికి రాజధాని అనేది తమకు సంబంధించిన వ్యవహారం కాదని,  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సోమిరెడ్డి ఇలాంటి డైలాగులు వేస్తుండటం విచిత్రమే.

 మరో తెలుగుదేశం మాజీ మంత్రి జవహర్ ఇలాంటి తెలివితేటల్లో రెండాకులు ఎక్కువే చదివారు.  ఆయన ఏకంగా జగన్మోహన రెడ్డికి…  నమ్మకాలు విశ్వాసాలకు  ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  జగన్ మోహన్ రెడ్డి జ్యోతిష్యం ఎక్కువ నమ్ముతారు అంటూ విమర్శలు చేస్తున్నారు.  విశాఖలోని స్వరూపానంద స్వామి చెప్పినందువలనే..  అక్కడకు రాజధానిని తరలించడానికి జగన్మోహన రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.

రాజధాని ఒకచోట ఉండాలా మూడు చోట్ల ఉండాలా అనేది పరిపాలనా పరమైన నిర్ణయం.  అధికార వికేంద్రీకరణ తో ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందని జగన్ ప్రభుత్వ ఆలోచన.  ఇలాంటి సంకల్పానికి వక్రభాష్యాలు చెబుతూ తెలుగుదేశం నాయకులు ప్రజల దురభిప్రాయాలు సృష్టించడం సబబు కాదు అని ప్రజలు భావిస్తున్నారు.