తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమైన హీరో కాదు. ఆయనకు సామాజిక, మానవీయ స్పృహ ఎక్కువే. అంతేకాదు దైవభక్తి కూడా అధికమే. అప్పుడప్పుడు హిమాలయాలకు ఒంటరిగా వెళ్లి అక్కడి గుహల్లో ధ్యానం చేసి వస్తుంటారు. మనసు ప్రశాంతత, ఏకాగ్రతత కోసమే ఇదంతా అని ఆయన చెబుతుంటారు.
సహజంగా అభిమానులు హీరోలను దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. కానీ రజనీ స్టైల్ వేరు. 70 ఏళ్లలో కూడా తనను హీరోగా అభిమానిస్తూ, ప్రోత్సహిస్తున్న అభిమానులే తన దృష్టిలో దైవసమానులని చెబుతారు.
ఇవ్వన్నీ ఎలా ఉన్నా , ఆయన నటించిన ‘దర్బార్’ సినిమా మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై కొన్ని చిట్కాలు చెప్పారు. ఆ సంతోష సూత్రాలు ఏంటంటే…
‘తక్కువగా ఆశ పడండి, తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి, తక్కువగా వ్యాయామం చేయండి, తక్కువగా మాట్లాడండి’ అని ఆయన సెలవిచ్చారు. మితం దేనికైనా మంచిదని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పుడదే సందేశాన్ని రజనీ కూడా మరోసారి గుర్తు చేశారు.
రజనీ చెప్పాడని కాదు కానీ, ఆయన చెప్పిన విషయాలన్నీ ఆచరణీయమైనవే. ఎంతైనా ‘బాష’ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు కదా?