అసెంబ్లీ సమావేశాల చివరి రోజున మూడు రాజధానుల గురించి నిండు సభలో ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ఆ తర్వాత ఎక్కడా దాని గురించి మాట్లాడలేదు. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆందోళనలు, ఇంకొంతమందిలో తీవ్ర గందరగోళం.. మధ్యలో రెండు కమిటీలు రిపోర్టులు కూడా ఇచ్చాయి, వీటిపై హైపవర్ కమిటీ కసరత్తు మొదలు పెట్టింది.
నిజానికి రాజధాని అంశంపై జగన్ మరోసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతి ఆందోళనలు శృతి మించాయి. ఏకంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేపైనే దాడికి తెగబడ్డారు. మరో ఎమ్మెల్యేని అడ్డుకుని ఆందోళన తెలిపారు. ప్రతిపక్షాలు దీన్ని శాంతియుత నిరసన అనొచ్చు, అధికార పక్షం హత్యాయత్నంగా అభివర్ణించొచ్చు. ఏదేమైనా దాడి జరిగిన మాట వాస్తవం.
అయితే హైపవర్ కమిటీ జరుపుతున్న వేళ రాజధానిపై మాట్లాడటం సమంజసం కాదని జగన్ భావిస్తున్నారు. అందుకే వివాదంపై కూడా స్పందించలేదు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దాడిని తీవ్రంగా ఖండించారు. మేం తల్చుకుంటే టీడీపీ నేతలు ఏమవుతారో చూస్కోండి అంటూ మంత్రి అనిల్ ఆవేశంగా మాట్లాడారు. “నేను శాంతియుతంగా ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేదా పల్నాటి పౌరుషం చూపించాల్సి వచ్చేది” అని పిన్నెల్లి కూడా కాస్త ఘాటుగానే బదులిచ్చారు.
సీఎం జగన్ బహిరంగంగా స్పందించలేదు కానీ, ఈ వ్యవహారంపై ఆయన సీరియస్ గా ఉన్నారు. నకిలీ ఉద్యమాన్ని అణచి వేయాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ పోలీసులు రైతుల ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఆందోళనకారులపై ఎక్కడా కేసులు నమోదు కాలేదు, ఒకవేళ నమోదైనా… వెంటనే బెయిల్ పై బైటకొచ్చేశారు.
మొన్న టీవీ9 జర్నలిస్ట్ పై దాడి, నేడు ఎమ్మెల్యేపైనే దాడి.. ఇలా వదిలేస్తే ఆందోళనలు శృతి మించే ప్రమాదం ఉందని సీఎం జగన్ ఉన్నతాధికారులను హెచ్చరించారట. అయితే సీఎం బహిరంగంగా ఈ ఆందోళనలపై మాట్లాడితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఆందోళనల వెనక ఎవరున్నారనేది బహిరంగ రహస్యం. కాబట్టి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలవైపు అందరి దృష్టి మళ్లించేలా ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేస్తే బాగుంటుంది.