అవతల సంక్రాంతి సినిమాలు అంటూ.. రెండు నెలల నుంచి హడావుడి చేస్తూనే ఉన్నారు. అవి భారీ బడ్జెట్ సినిమాలే. అదే సమయంలో మరో భారీ బడ్జెట్ సినిమా కూడా సంక్రాంతికి కొంచెం ముందుగా బరిలోకి దిగుతూ ఉంది. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా. తమిళంలో రూపొంది, తెలుగులో కూడా విడుదల అవుతున్న సినిమా. ఒక దశలో రజనీకాంత్ కు తెలుగునాట ఇక్కడి స్టార్ హీరోలకు సమానమైన మార్కెట్ కనిపించింది. అయితే గత కొన్నాళ్లుగా ఆ హీరో సినిమాలు ఇక్కడ నిరాశ పరుస్తూ ఉన్నాయి ప్రేక్షకులను. అయితే అలాగని రజనీకాంత్ సినిమాలు మరీ పడిపోలేదు.
కానీ.. తాజా సినిమా దర్బాన్ కు మాత్రం సరైన ప్రమోషన్ లేదు. ఏదో ఒక మోస్తరుగా చేశారు కానీ, అవతల సంక్రాంతి సినిమాలకు ఉన్న ప్రమోషన్ తో పోలిస్తే మాత్రం.. పదో వంతు ప్రమోషన్ కూడా ఈ సినిమాకు లేదు. ఏదో నామమాత్రంగా రజనీకాంత్ ఒక ఈవెంట్ కు హాజరయ్యారు. మురుగదాస్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అలా తూతూ మంత్రం ప్రమోషన్ మాత్రమే సాగింది సినిమాకు.
అయితే రేపు విడుదల కానున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే మంచి స్థాయిలో ఉండవచ్చని అంచనా. ప్రమోషన్ భీకర స్థాయిలో లేకపోయినా.. ఈ సినిమాను తెలుగునాట కొంతమంది అయినా గుర్తించే అవకాశం ఉంది. థియేటర్లకువెళ్లే అవకాశమూ ఉంది. అయితే ఎటొచ్చీ సంక్రాంతి సినిమాలు విడుదల ప్రభావం రజనీకాంత్ సినిమా మీద కచ్చితంగా పడొచ్చు. సాదాసీదా టాక్ ను తెచ్చుకుంటే.. రజనీకాంత్ వసూళ్లపై సంక్రాంతి సినిమాలు భారీ దెబ్బనే కొడతాయి. ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. సంక్రాంతి వరకూ రజనీకాంత్ సినిమా కూడా రేసులో నిలబడినట్టే!