అమరావతి రాజధాని…అమ్మా మీకు ముందుగా పాదాభివందనాలు. భూమాతను ప్రేమించని బిడ్డలు ఎవరుంటారమ్మా? మాతృదేవోభవ అని దైవం కంటే మీకే మొదటి స్థానం కల్పించిన పుణ్యభూమి అమ్మా మనది. గత 22 రోజులుగా మీరు ఒంటరిగా విలపిస్తుంటే మా హృదయం తట్టుకోలేక పోతోంది. మనసు గిలగిలలాడుతోంది. మిమ్మల్ని చూస్తుంటే అశోక వనంలో సీతమ్మలా కనిపిస్తున్నారమ్మా?
బహుశా ఆ సీతమ్మ కష్టాలే మీకు వచ్చాయనిపిస్తోంది. 22 రోజులుగా మీరు ఉద్యమిస్తున్నా ఆంధ్రప్రదేశ్ సమాజం నుంచి కనీస మద్దతు లేకపోవడం మాకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందమ్మా. ఏం చేద్దాం తల్లి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తప్పు ఎంత మాత్రం కాదమ్మా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంత ప్రజలందరూ ఎంతో మంచి వారమ్మా. వారికి మంచి హృదయం ఉంది. స్పందించే గుణం ఉంది. అదే సమయంలో అన్యాయంపై నిరసన వ్యక్తపరిచే గుణం ఉందమ్మా.
తెలంగాణలో దిశపై అత్యాచారం, హత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ సమాజం మాతృవేదనతో తల్లడిల్లింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఊరూవాడా ఏకమై ముక్తకంఠంతో నినదించింది. అంతెందుకు తల్లి మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని దేశంలోనే మొట్టమొదటగా మన జగన్ సర్కార్ తీసుకొచ్చింది. దీనికి మన ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం మద్దతు పలికారు.
ఇంతేనా…మన వాళ్లు ఎంత గొప్ప మనసు కలవారో అని చాటేందుకు అనేక నిదర్శనాలున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు ఉద్యమబాట పట్టారు. మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆ చట్టానికి మద్దతు తెలిపాయి. అయితే ప్రజాఉద్యమంతో ఆ రెండు పార్టీల అధ్యక్షులను తమకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించేలా చేసిన పోరాట గొప్పదనం మనదమ్మా.
ఇంత గొప్ప మనసున్న ఆంధ్రా ప్రజలు ఒక్క అమరావతి విషయంలోనే రాజధాని రైతులకు మద్దతుగా నిలవకపోవడం మాక్కూడా కొంచెం మనసు బాధగానే ఉందమ్మా. దీనికి బలమైన కారణం లేకపోలేదమ్మా. అమ్మా మీ పేరు (రాజధాని) చెప్పి గత పాలకులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డం, భారీగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం…ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయమ్మా.
ఇప్పటికే 4,070 ఎకరాలను గత పాలకులు కొన్ని సొంతంగానూ, మరికొన్ని ఎకరాలు బినామీల పేర్లతో కొనుగోలు చేసిన వారి పేర్లు సైతం బయటికొచ్చాయమ్మా. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయంటున్నారమ్మా. దీంతో మీ బిడ్డ వైఎస్ జగన్ మీతో పాటు మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పిల్లలను కూడా అభివృద్ధి చేయాలని సంకల్పించారమ్మా.
ముగ్గురు పిల్లల్లో… సాగు, తాగునీటికి సమృద్ధిగా నోచుకున్న బిడ్డ ఒకరైతే, నీళ్లకు నోచుకోక, కరవు కాటకాలతో, ఆకలితో అలమటిస్తున్న మరో ఇద్దరు బిడ్డలున్నారమ్మా. అమ్మా మాతృహృదయంతో ఎవరి వైపు ఉంటావో చెప్పు తల్లి. మీ మాతృ హృదయం మాకు తెలుసమ్మా…కరవు కాటకాలతో అల్లాడుతున్న బిడ్డల వైపే మొగ్గు చూపుతావని…అదే కదమ్మా మన జగన్ కూడా చేస్తున్నది! రాష్ట్రానికి ఓ పెద్ద దిక్కుగా, తండ్రిగా ఆయన ‘అందరూ బాగుండాలి – అన్ని ప్రాంతాలు బాగుండాలి’ అనే పెద్ద మనసుతో మూడు ప్రాంతాలను సమదృష్టితో చూడాలనుకోవడం తప్పా తల్లి.
భూమాతను పూజించాల్సింది పోయి వ్యాపారం చేసుకోవాలనే వారికి జగన్ నిర్ణయం కోపం తెప్పించిందమ్మా. తల్లి మీ (రాజధాని) పేరుతో చేస్తున్న రియల్ ఎస్టేట్ ఆరాటానికి ప్రజా మద్దతు కొరవడింది. అంతే తప్ప అన్యాయాన్ని చూస్తూ ఆంధ్రప్రదేశ్ సమాజం సహించే మనస్తత్వం కాదమ్మా. ఏమ్మా మీ పెంపకంపై మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? మేము నీళ్లకు, పంటలకు పేదవాళ్లమే తప్ప అభిమానానికి, ప్రేమకు కాదని మీకు తెలియని విషయమా తల్లి. మేము గొడ్డు కారం తినేవాళ్లమే కావచ్చు…కానీ ఆ కారంలో మమకారం ఉందమ్మా. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పూజిస్తామే తప్ప ఒంటరిని ఎందుకు చేస్తాం. మీ పేరుతో సాగుతున్న అవినీతిని ఒంటరి చేయడానికే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రాజధాని రైతుల ఆందోళనకు సహాయ నిరాకరణ చేస్తోంది. అంతే తప్ప మిమ్మల్ని కాదని ఒకటికి వందసార్లు పాదాభివందనాలు చేస్తూ వినమ్రతతో విన్నవించుకుంటున్నాం.
ఇట్లు
మీ ఆంధ్రప్రదేశ్ బిడ్డలు