తెలుగు సినిమాల దుబాయ్ సెన్సారు కు కూడా ప్రాధాన్యత వుంది. ఎందుకంటే అక్కడి నుంచే అసలు సినిమాలు ఎలా వున్నాయి అన్నది టాలీవుడ్ లోకి ముందుగా వస్తుంటుంది. కొందరు ఔత్సాహికులు ట్విట్టర్ లో కూడా పెడుతుంటారు. అవి కొన్ని సార్లు ఢమాల్ మంటాయి. కొన్నిసారు కరెక్ట్ అవుతుంటాయి. టాలీవుడ్ సెన్సారు అంటే రఫ్ రీ రికార్డింగ్ యాడ్ చేయడం, లేదా డీటీఎస్ మిక్సింగ్ వంటివి జరగకుండా సెన్సారు చేయించడం వంటివి జరుగుతుంటాయి. దుబాయ్ లో అలా కాదు. ఫైనల్ కాపీ సెన్సారు అవుతుంది. అందుకే దుబాయ్ సెన్సారు టాక్ కు ప్రాధాన్యత వుంది
విషయానికి వస్తే, పండగకు పోటాపోటీగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు రెండూ ఈ రోజు (మంగళవారం) దుబాయ్ సెన్సారు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాయి. దాంతో టాలీవుడ్ నుంచి దుబాయ్ సెన్సారు టాక్ మీద ఎంక్వయిరీలు ప్రారంభమయ్యాయి. నిజానికి సెన్సారు అయిందని కొందరు, కాలేదని మరి కొందరు చెబుతున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు సినిమాల సెన్సారు జరిగిపోయింది.
కానీ సెన్సారు టాక్ ను మాత్రం వీలయినంత బిగబట్టి వుంచినట్లు బోగట్టా. రెండు సినిమాల ట్రయిలర్ లు బయటకు వచ్చాయి. సూపర్ అనేవారు వున్నారు. ఫరవాలేదు అనేవారు వున్నారు. పొగిడేవారువున్నారు, పెదవి విరిచిన వారు వున్నారు. వాళ్లకు మించి కోట్లు పెట్టుబడి పెట్టిన వారు వున్నారు.
ఇలాంటి నేపథ్యంలో సెన్సారు టాక్ దాని చిత్తానికి అది బయటకు వస్తే,లేని పోని టెన్షన్లు. అందుకే సెన్సారు కాలేదని, దగ్గర చేసి సెన్సారు అవుతుందని, రేపో ఎల్లుండో అవుతుందని బయటకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సినిమాల దుబాయ్ సెన్సారు టాక్ మాత్రం ఓవర్ సీస్ లో వివిధ దేశాలకు సినిమాలను కొన్నవారికి మాత్రం స్ప్రెడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.