సీమ ఉద్యమానికి జేసీ స్కెచ్‌ వేస్తాడా?

టీడీపీ మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డి పరిచయం అక్కర్లేని నాయకుడు. 'పచ్చ' పార్టీలో ఈయన ప్రత్యేక నాయకుడు. వివాదస్పదంగా మాట్లాడటంలో నిపుణుడు. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం…

టీడీపీ మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డి పరిచయం అక్కర్లేని నాయకుడు. 'పచ్చ' పార్టీలో ఈయన ప్రత్యేక నాయకుడు. వివాదస్పదంగా మాట్లాడటంలో నిపుణుడు. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆయన చెప్పింది అర్థం చేసుకోవాలంటే జుట్టు పీక్కోవాల్సిందే. అధినేతను సైతం పబ్లిక్‌గా మాటలు అనగల సత్తా ఉన్నోడు.

ఇలాంటి జేసీ దివాకర్‌ రెడ్డి కొంతకాలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలోనే పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వారిని అగౌరవంగా మాట్లాడి చిక్కుల్లో పడ్డాడు. జేసీపై ఆగ్రహించిన పోలీసులు ఈమధ్య అరెస్టు చేసి ఎనిమిది గంటలపాటు పోలీసు స్టేషన్లో ఉంచి అవమానించి ప్రతీకారం తీర్చుకున్నారు. 

గతంలో చంద్రబాబు మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబును ఒక్కోసారి పొగుడుతాడు. ఒక్కోసారి వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడతాడా, యధాలాపంగా అంటాడా అనేది తెలియదు. ఒక్కోసారి పొగుడుతున్నాడో విమర్శిస్తున్నాడో అర్థం కాదు. ఒకవిధంగా చెప్పాలంటే జేసీ టీడీపీ ఎంపీ అయినా 'పచ్చ'దనం పూర్తిగా పులుముకోలేదు.

2014 ఎన్నికలప్పుడు కాంగ్రెసు గెలిచే అవకాశం లేదని అంచనా వేసుకునే టీడీపీలో చేరి విజయం సాధించాడు. వాస్తవానికి వ్యక్తిగత ఛరిస్మా ఉన్న కాంగ్రెసు నాయకులు కూడా ఇంటిబాట పట్టారు. జేసీకి వ్యక్తిగత ఇమేజ్‌కు తక్కువ లేదు. కాని కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసుంటే అప్పట్లో సీన్‌లో ఉండకపోయేవాడే. 

చంద్రబాబంటే విపరీతమైన అభిమానమో, టీడీపీ అంటే ప్రేమో ఆయనకు లేవు. జేసీ ఏం మాట్లాడినా మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది. అవును మరి మాటలు తూటాల్లా పేలుస్తాడు కదా. జేసీ కామెంట్స్‌కు చంద్రబాబు చిరాకు పడినా బయటపడిన దాఖలాలు లేవు.

కాని గతంలో ఒకసారి జేసీ చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో ప్రముఖంగా రావడంతో బాబుకు కోపం వచ్చింది. 'లూజ్‌ టాక్‌ సహించను' అని బాబు జేసీని హెచ్చరించారు. లూజ్‌గా మాట్లాడేవారు పార్టీకి దూరమవుతారని బాబు అన్నారు. కాని ఇప్పటివరకు దూరం కాలేదు. ఈయన ఒక్కోసారి వ్యవహరించే తీరు చూస్తే టీడీపీలో ఉంటాడా? పోతాడా? అనిపించేటట్లుగా ఉంటుంది. మొన్న బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌  రెడ్డిని కలుసుకున్నాడు. 

వెంటనే జేసీ కాషాయం కండువా కప్పుకోబోతున్నాడని ప్రచారం జరిగింది.  తనకు బీజేపీలో చాలమంది మిత్రులున్నారని, మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని చెప్పాడు. ఇక బీజేపీలో చేరే విషయంలో అవునని, కాదని కచ్చితంగా చెప్పలేదు. చాలా విచిత్రంగా, ఎదుటోడి బుర్ర తిరిగిపోయేలా మాట్లాడాడు. బీజేపీలో చేరే ప్రసక్తి లేదంటూనే ఎప్పుడు చేరతాడో కూడా చెప్పాడు.

కేంద్ర ప్రభుత్వం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ను భారత్‌లో విలీనం చేసినప్పుడు కచ్చితంగా బీజేపీలో చేరతానన్నాడు. ఇదేం కండిషనో అర్థం కాదు. అంటే తాను బీజేపీలో చేరనని ఇలా పరోక్షంగా చెప్పాడని అనుకోవాలా? పీవోకేను ఇండియాలో కలిపితే తనలాంటివారు చాలామంది బీజేపీలో చేరతారట…! పీవోకేను ఇండియాలో కలిపితేనే బీజేపీలో చేరతామని పట్టుబటి కూర్చునేవారు ఎవరూ లేరు. 

బీజేపీలో చేరడానికి, పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి సంబంధం ఏమిటి? బీజేపీలో చేరడమనేది రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. సరే…ఇక అసలు విషయమేమిటంటే రాజధాని విభజన అంటే మూడు రాజధానుల విషయం. మూడు రాజధానుల నిర్ణయం తల, కాళ్లు, చేతులు వేరు చేసినట్లుగా ఉందని మండిపడ్డాడు.

'అమరావతి నుంచి రాజధాని తరలిస్తే గ్రేటర్‌ రాయలసీమ ఉద్యమం తప్పదు' అని చెప్పాడు దీనిపై త్వరలోనే సమావేశం పెడతామన్నాడు ఈ మాజీ ఎంపీ. అంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం జేసీ ఉద్యమించాలని అనుకుంటున్నాడా?  'మా ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి' అని కూడా డిమాండ్‌ చేశాడు. అంటే మొత్తం రాయలసీమనా? అనంతపురం జిల్లానా? 

అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమాండ్‌ చేస్తున్న సీమ నాయకులు అలా కుదరదనుకుంటే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు. ఇందుకోసం ఉద్యమిస్తామంటున్నారు. విశాఖపట్టణమే రాజధాని అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇక అధికారిక నిర్ణయం రావాల్సివుంది.

అది రాగానే రాయలసీమ రాష్ట్రం కోసం అక్కడి నేతలు ఉద్యమిస్తారా? కొందరు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడకుండా, తమ జిల్లాలకు రాజధాని హంగులు సమకూర్చాలని అడుగుతున్నారు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ మినీ సచివాలయాలు ఏర్పాటు చేయాలంటున్నాడు. సచివాలయం రాజధానిలో మాత్రమే ఉంటుంది. మినీ సచివాలయాలు అనేవి ఉండవు. కాని ఈ కొత్త కాన్సెప్టును టీజీ వెంకటేష్‌ తెరమీదికి తీసుకొచ్చాడు.  మినీసచివాలయమంటే ఏమిటో ఆయనే వివరించాలి.