సినిమా ఫంక్షన్ లో ఎవరెవరో ఏవేవో మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా 'నీ భుజం నేను నొక్కుతా..నా భుజం నువ్వు నొక్కు' అనే టైపులో వుంటాయి. భాజా భజంత్రీలు ప్రత్యేకంగా అక్కరలేదు. అయితే హీరోల మాటలు మాత్రం కాస్త డిఫరెంట్ గా వుంటాయి. థాంక్స్ సర్..థాంక్స్ సర్ అంటూ అటు అభిమానులకు, ఇటు సినిమాకు పని చేసిన వారికి థాంక్స్ చెప్పుకోవడం ఎక్కువగా వుంటుంది.
అయితే అప్పుడప్పుడు మాత్రం డిఫరెంట్ గా మాట్లాడుతుంటారు. అలాంటి మాటల్లో చాలా అర్థాలు దొర్లుతుంటాయి. నిన్నటికి నిన్న జరిగిన 'అల వైకుంఠపురములో' సినిమా మ్యూజికల్ ఫంక్షన్ లో హీరో బన్నీ మాటలు అలాగే వున్నాయి. బన్నీ ఎలా మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా బన్నీ మాటల్లో వేరే అర్థాలు వున్నాయన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫంక్షన్ లో బన్నీ స్పీచ్ స్టార్ట్ చేస్తూ మామూలుగానే మాట్లాడారు. దాదాపు 18 నిమషాలు సినిమా గురించి, సినిమాకు పని చేసిన వారి గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ ఉన్నట్లుండి బన్నీ స్పీచ్ ఇంటి వైపు షిఫ్ట్ అయింది.
'డాడీకి ఫస్ట్ టైమ్ థాంక్స్ చెబుతున్నా' అంటూ కాస్త ఎమోషన్ అయ్యారు. కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. మా నాన్నలో సగం అయితే చాలు, అవ్వగలిగితే చాలు అంటూ చెప్పుకొచ్చారు. తన భార్యకు పెళ్లికి ముందే, నాన్నతో కలిసి ఇంట్లో వుండాలని కండిషన్ పెట్టా అన్నారు. నిజంగానే బన్నీ ఇప్పటికీ అరవింద్ తో కలిసే వుంటున్నారు. హీరో కృష్ణ, మహేష్ బాబుల విషయం అలా కాదు. వారు వేరు వేరుగానే వుంటారు.
అలాగే తన తండ్రికి పద్మశ్రీ బిరుదు ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ మాటల్లోనే ఇన్నర్ మీనింగ్ లు తీస్తూ, గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు ఫంక్షన్ కు వెళ్లి, హీరో కృష్ణకు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు. ఈ నేఫథ్యంలోనే తన తండ్రికి పద్మశీ రావాలన్నది తన కోరిక అని బన్నీ అని వుంటారని టాక్ వినిపిస్తోంది. కృష్ణ సౌత్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ అని మెగాస్టార్ అంటే, సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ తన తండ్రి అని బన్నీ అనడం విశేషం.
అలాగే తండ్రితోనే వుండాలి. తండ్రి స్థాయిలో సగం కాగలిగితే చాలు, అని అనడం వెనుక కూడా మెగాస్టార్ ప్రసంగం వుందని వినిపిస్తోంది. ఒకప్పుడు కృష్ణగారి అబ్బాయి మహేష్, ఇప్పుడు మహేష్ తండ్రి కృష్ణ అనే రేంజ్ కు వెళ్లాడు అని మెగాస్టార్ అన్నారు. దీనికి రివర్స్ లో తన తండ్రి సాధించిన దాంట్లో సగం సాధించగలిగితే చాలు అని బన్నీ అన్నారు.
తను ఎన్నాళ్లు ఇంట్లో ఖాళీగా వున్నా, తన ఫ్యాన్స్ తనను అభిమానించడం మానలేదని, తనకు మాత్రమే ఆర్మీ వుందని, మిగిలిన హీరోలకు ఫ్యాన్స్ మాత్రమే వుంటారని బన్నీ అనడం విశేషం. ఇలా బన్నీ ప్రసంగం వెనుక ఇన్నర్ మీనింగ్ లు, అన్యాపదేశ కామెంట్లు వున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.