గెలుస్తామనే ధీమాతోనే యుద్దంలోకి దిగాలి. గెలవవేమో అన్న భయంతో దిగకూడదు. ఇది మినిమమ్ నాలెడ్జ్. కానీ వైకాపా నేతలకు మాత్రం ఈ చిన్న సూత్రం తెలియక నానా గత్తర చేసుకుంటూ, జనాల్లో జనసేన-తెలుగుదేశం పార్టీ కలిస్తే వైకాపాకు కష్టం అనే అభిప్రాయాన్ని ఎవరో ప్రత్యేకంగా పంపించలేదు. వైకాపా నేతలే పంపించారు.
దమ్ముంటే ఒంటరిగా రండి అని ఇటు తేదేపా అటు జనసేన ను కవ్విస్తూ. దాంతో ఏమయింది. వాళ్లు కలిస్తే వీళ్లకు భయం అనే భావన సర్వత్రా వెళ్లిపోయింది. నిన్నటికి నిన్న జనసేన-తేదేపా పొత్తు పొడవగానే దేశం అను కుల మీడియా, అను కుల వర్గాలు సంబరపడిపోయింది అందుకే. ఇక తాము గెలిచేసాం, అధికారంలోకి వచ్చేసాం అనేంతగా సంబర పడుతున్నారు. దీనికి తోడు వైకాపా వర్గాలు కూడా అదే దోవన పోతున్నాయి.
పొత్తు ఫిక్స్ అయిన తరువాత కూడా ఇంకెందుకు విమర్శలు. రండి ఎంత మంది కలిసి వస్తారో.. చూసుకుందాం అనే తీరుగా మాట్లాడితే కార్యకర్తల్లో ధైర్యం పెరుగుతుంది. దైన్యం ఏర్పడదు. పైగా ఆఫ్ ది రికార్డుగా కూడా వైకాపా నేతలు, ఆ రెండు పార్టీలు కలిసి వస్తే తమకు కొంచెం కష్టమే అన్న రీతిలో మాట్లాడుతున్నారని వార్తలు అందుతున్నాయి. ఇది కూడా కరెక్ట్ కాదు.
యుద్దం అనివార్యం అని తెలుసు. అటు అందరూ కలిసి వస్తున్నారని తెలుసు. అయినా తాము ఫైట్ చేయాల్సిందే అని తెలుసు. అలాంటపుడు దానికి తగినట్లు తమ బలాన్ని, బలగాన్ని పెంచుకోవాలి. ఆత్మ స్ధయిర్యాన్ని పెంచుకోవాలి తప్ప బేజారు తనం వెలికి వచ్చేలా మాట్లాడడం కాదు.