నిరీక్షణలోనే షర్మిల: కోరుకున్నది దక్కేనా!?

వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి..  ప్రభంజన సదృశ్యంగా, ఒక ఉద్యమ కెరటం లాగా తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి ప్రస్థానం ప్రారంభించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్ షర్మిల భవిష్యత్తు ప్రస్తుతం…

వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి..  ప్రభంజన సదృశ్యంగా, ఒక ఉద్యమ కెరటం లాగా తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి ప్రస్థానం ప్రారంభించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్ షర్మిల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది.  

తన సొంత పార్టీ ద్వారానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసే అధికారంలోకి వస్తామని, కెసిఆర్ ను మట్టికరిపిస్తామని ప్రగల్భాలు పలికిన షర్మిల, కనీసం ఎన్నికల వరకు పార్టీని నడిపే సామర్థ్యం లేక కాంగ్రెసులో విలీనానికి సిద్ధపడ్డారు. రెండుదఫాలుగా ఢిల్లీ పెద్దలతో సమావేశం కూడా అయ్యారు. అయినా ఇప్పటికీ ఆమెకు నిరీక్షణ పర్వం తప్పడం లేదు.  

సిడబ్ల్యూసి సమావేశాల కోసం, సోనియా రాహుల్ తదితర కాంగ్రెస్ దిగ్గజాలు అందరూ హైదరాబాదుకు వస్తున్న తరుణంలో కనీసం వైయస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనే వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా? ఆమె నిరీక్షణకు తెరపడుతుందా? ఆమె రాజకీయ ప్రస్థానం కోరుకున్న విధంగానే ముందుకు నడుస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

వైయస్ షర్మిల ఆశిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రాజకీయాల్లో అమిక పెద్దపీట వేసి ఆదరించడానికి కాంగ్రెస్ పార్టీ అంత సుముఖంగా లేదని అర్థమవుతోంది. ఏపీ రాజకీయాలలో ఆమె క్రియాశీల పాత్రను కాంగ్రెస్ కోరుకుంటోంది.  ఆ విషయంపై ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారని సమాచారం. అయితే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా ఆమెకు ఎంపీ హోదా కట్టబెట్టడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.  

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఆమె వేలు పెట్టడానికి ఇక్కడి సీనియర్లు అనేకమంది విముఖంగా ఉన్నారు.. ఇప్పుడున్న పరిస్థితులు, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆమె నిన్నటిదాకా కోరుకున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు ఎమ్మెల్యే స్థానాన్ని.. ఆమె కేటాయించడం కూడా కష్టసాధ్యమే. అలాంటప్పుడు తనకు ఏం దక్కుతుందని స్పష్టత లేకుండా.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి కొన్ని సంవత్సరాల పాటుపడిన కష్టాన్ని గంగలో కలిపేయడానికి, కాంగ్రెస్లో విలీనం కావడానికి షర్మిల సిద్ధమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అందుకు మించి ఆమె ముందు ప్రస్తుతం వేరే ప్రత్యామ్నాయాలు కూడా లేవని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిడబ్ల్యుసి సమావేశాలు ముగిసే సమయానికి..  షర్మిల నిరీక్షణ పర్వం కూడా ముగుస్తుందని పలువురు అంటున్నారు.

కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ ద్వారా మంత్రాంగం నెరపుతున్న షర్మిల.. ఏ మేరకు తాను అనుకున్నది నెరవేర్చుకుంటారో వేచి చూడాలి.