మంట పుట్టిస్తున్న జనసేన మాజీ నేత ట్వీట్లు

ప్రజా జీవితంలోకి ఒక్కసారి వచ్చాక రాళ్ళూ ముళ్ళూ రెండూ కూడా ఎదుర్కోవాలి. ఏ విమర్శ అయినా స్వీకరించాలి. కొన్ని సార్లు విమర్శలు ఇండైరెక్ట్ గా కూడా వచ్చినా సర్దుకోవాలి. జనసేన నుంచి 2019 ఎన్నికల్లో…

ప్రజా జీవితంలోకి ఒక్కసారి వచ్చాక రాళ్ళూ ముళ్ళూ రెండూ కూడా ఎదుర్కోవాలి. ఏ విమర్శ అయినా స్వీకరించాలి. కొన్ని సార్లు విమర్శలు ఇండైరెక్ట్ గా కూడా వచ్చినా సర్దుకోవాలి. జనసేన నుంచి 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి రెండు లక్షల ఎనభై వేల ఓట్లను తెచ్చుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు.

ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టకపోయినా ఆ ట్వీట్లు చూస్తే చాలు ఎవరికి తోచిన అర్ధాలు వారికి స్పురిస్తాయి. ఇంతకీ ఆయన పెట్టిన ట్వీట్ ఏమిటి అన్నది చూస్తే ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ కవిత అన్న మాట.

“సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే పంక్తులను పోస్టు చేసారు. ఈ కవిత చాలా తక్కువ మందికి తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ తరచూ సభలలో దీనిని చెప్పడం ద్వారా  ఈ కవితను  పాపులర్ చేసారు.

పవన్ కి ఈ కవితా పంక్తులు చాలా ఇష్టం. ఆయన ఇంతలా  ఇష్టపడిన ఈ కవితా పక్తులను మాజీ జేడీ పెట్టడం వెనక ఏమిటి కధ అన్నది తెలియదు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయన ట్వీట్ పెట్టి ఉంటారా అనిపిస్తోంది అంటున్నారు.

జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుని కలసి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ జైలు బయటనే పొత్తులను ప్రకటించారు. దాని మీదనే ఏపీలో కొంత చర్చ సాగుతోంది మాజీ జేడీ ట్వీట్ వెనక భాష్యాలు ఏమిటి అన్నది ఎవరికి తోచిన తీరున వారు చెప్పుకుంటున్నారు.

మాజీ జేడీ  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కంగ్రాట్స్ చేస్తూ  రెండవ ట్వీట్  పోస్టు చేసారు. ఒకే రోజున కేసీయార్ జగన్ వైద్య కళాశాలలను ప్రారభించారు. దీన్ని వైట్ కోట్ రివల్యూషన్ గా మాజీ జేడీ అభివర్ణించారు. లక్ష్మీనారాయణ ఏపీలో మంచి జరిగితే మంచి అని పొగుడుతున్నారు. మంచి కాదు అనుకుంటే విమర్శిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన నిర్మాణాత్మకమైన విపక్ష పాత్ర పోషిస్తున్నారు.

జనసేనతో విభేదించి బయటకు వచ్చిన మాజీ జేడీ పెట్టిన రెండు ట్వీట్లూ మంట పుట్టించేలా ఉన్నాయి. వైసీపీ అనుకూలురు అయితే హ్యాపీగా తీసుకుంటున్నారు. వ్యతిరేకులు మాత్రం కవితా పక్తులు అర్ధం అయ్యీ కాక బుర్ర గోక్కుంటున్నారు.