విరాళాల ఇరకాటంలో టాలీవుడ్?

సామాజిక బాధ్యత అన్నది సమాజంలో వున్న ఎవరికైనా వుంటుంది. ఉండాలి కూడా. అయితే ఒక్కోసారి ఆ బాధ్యతలు బరువుగా మారకూడదు. తప్పనిసరి తద్దినాలుగా మారకూడదు. కానీ టాలీవుడ్ జనాలకు రాను రాను విరాళాలు అన్నది…

సామాజిక బాధ్యత అన్నది సమాజంలో వున్న ఎవరికైనా వుంటుంది. ఉండాలి కూడా. అయితే ఒక్కోసారి ఆ బాధ్యతలు బరువుగా మారకూడదు. తప్పనిసరి తద్దినాలుగా మారకూడదు. కానీ టాలీవుడ్ జనాలకు రాను రాను విరాళాలు అన్నది ఓ మొహమాటపు వ్యవహారంగా, తప్పసరి వ్యవహారంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కుండ బద్దలు కొట్టారు. 

ఒకప్పుడు సినిమా వాళ్లు జనాల దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి అందించేవారు. అదే ఆనాటి సామాజిక బాధ్యతగా భావించేవారు. అంటే జనాల దగ్గర సినిమా టికెట్ లు వసూలు చేసినట్లు విరాళాలు కూడా వసూలు చేసి ప్రభుత్వానికి అందించేవారు. అదే టైమ్ లో మీడియా సంస్థలు కూడా జనాల నుంచే విరాళాలు వసూలు చేసి ప్రభుత్వాలకు అందించడమో, లేదా స్వచ్ఛంధ సంస్థలకు ఇవ్వడమో చేసేవారు. 

టాలీవుడ్ లో కొత్త జనరేషన్ వస్తున్న కొద్దీ ట్రెండ్ మారింది. వారు జనాల్లోకి వెళ్లి, విరాళాలు వసూలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే కావచ్చు, తమ వంతు బాధ్యతగా తమకు తగినట్లు విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదంతా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. తమ కష్టార్జితంలో కొంత మొత్తాన్ని తమను ఈ స్థాయికి తెచ్చిన వారికోసం ఇవ్వడం అన్నది కచ్చితంగా మంచి విషయమే కదా.

కానీ సోషల్ మీడియా, ఫ్యాన్స్, ప్రభుత్వాలతో ఆబ్లిగేషన్స్ ఇవన్నీ కలిసి సినిమా జనాలకు విరాళాలు ఇవ్వడం అన్నది మాండేటరీగా మార్చేస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా టైమ్ లో సినిమా జనాలు అందరూ భారీగా విరాళాలు అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కావడంతో రెండింటికి సమానంగా ఇవ్వాల్సి వచ్చింది. అదే సమయంలో కొందరు హీరోలు నేరుగా కూడా జనాలకు సాయం అందించారు. అయితే అప్పుడే కరోనా ప్రారంభం కాబట్టి ఎవరికీ పెద్దగా ఇబ్బంది వుండి వుండదు.

కానీ కరోనా వచ్చి ఇప్పటికి ఆరు నెలలు అయింది. సినిమా ఇండస్ట్రీ స్థంభించిపోయింది. నిర్మాణాలు ఆగిపోయాయి. నిర్మాతలు తెచ్చుకున్న ఫైనాన్స్ పై వడ్డీలు కట్టాల్సి వస్తోంది. పూర్తయిన సినిమాలను బీరువాల్లో పెట్టుకుని సరైన టైమ్ కోసం చూస్తున్నారు. పూర్తి కావాల్సిన సినిమాలను కష్ట నష్టాలకు ఓర్చి మరీ పూర్తి చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యలో రెండు రాష్ట్రాలకు వరద తాకిడి వచ్చి పడింది. ముఖ్యంగా హైదరాబాద్ అతలాకుతలం అయింది. ప్రభుత్వం తన వంతు సాయం ప్రకటించి ముందుకు వెళ్తోంది.

ఇలాంటి టైమ్ లో అలవి అయినా కాకపోయినా, మళ్లీ టాలీవుడ్ జనాలు కూడా స్పందించి కొంత మంది విరాళాలు ప్రకటించారు. అయితే ఇప్పుడు దీని మీద రెండు రకాల వార్తలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కు ఇచ్చారు ఆంధ్రకు ఇవ్వలేదనే విమర్శలు కొంత. ఇబ్బందుల్లో వున్నా ఇవ్వక తప్పడం లేదని కొన్ని, అసలు కొంచెమే ఇచ్చారు. జనాలు ఇచ్చిన డబ్బులే  కదా, ఇంకా ఇవ్వవొచ్చు కదా అని మరి కొన్ని, ఇలా రకరకాల విమర్శలు. ఇవ్వని వారిని ఇవ్వలేదని మరోపక్క.
అసలు ఇవన్నీ చూస్తుంటే విరాళాలు ఇవ్వడం అన్నది ఆబ్లిగేషన్ గా మాండేటరీగా మారుతోందా?అనిపిస్తోంది. అలాగే ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కూడా వీటిని ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న బాహుబలి ప్రభాస్ ముందు కోటి రూపాయలు ప్రకటించి మళ్లీ వెంటనే కాదు కోటిన్నర అన్నారు. ఇలా అనడం వెనుక తన పాన్ ఇండియా ఇమేజ్, ఫ్యాన్స్ ఇవన్నీ వుండే వుంటాయని తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఓ సంస్థ నెలకు కొటి రూపాయలకు పైగా వడ్డీనే కడుతూంది. ఇప్పడు ఆ సంస్థ కూడా విరాళం ఇచ్చింది. కరోనాటైమ్ లో కనీసం 10 నుంచి 20 కోట్లు పొగొట్టుకున్నా కూడా విరాళం అంటే తప్పడం లేదు అనుకోవాలి. నిజానికి నిర్మాణ సంస్థలైనా వ్యక్తులే. ఎందుకంటే టాలీవుడ్ లో నిర్మాణం పేరుకు కంపెనీలుగా వుంది కానీ జరిగేది అంతా వ్యక్తగతం వ్యాపారమే. సినిమా పరిశ్రమ కరోనా వల్ల ఆగిపోయినపుడు వాటిల్లే నష్టం వ్యక్తిగతమే.

నిజానికి విరాళాలు ఈ టైమ్ ఇవ్వగలిగింది. మెగా ఇంజినీరింగ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు. ఎందుకంటే అవి ప్రభుత్వం నుంచి వివిధ పనులు తీసుకుని, లాభాలు సంపాదించి ఎదుగుతాయి. అంటే ప్రజల డబ్బే వారి దగ్గరకు లాభాల రూపంలో చేరేది. అలాగే కరోనా టైమ్ లో విపరీతంగా లాభాలు ఆర్జించిన వైద్య సంస్థలు. కానీ అవేవీ కనీసం స్పందించినట్లు కనిపించడం లేదు.

ఇవన్నీ ఇలా వుంచితే ప్రజా ప్రతినిధుల విరాళాలు చిత్రంగా వుంటాయి. కేవలం వారి జీతాలు  లేదా భత్యాలు మాత్రమే వారు విరాళాలుగా ఇస్తారు. నెల జీతం లేదా రెండు నెలల వేతనం ఇలా. అంతే తప్ప, ప్రజా ప్రతినిధులు కోట్ల కొద్దీ విరాళాలు ఇవ్వడం అన్నది చాలా తక్కువ. పైగా ప్రజా ప్రతినిధుల్లో, అది ఏ రాష్ట్రమైనా కోట్లకు పడగలెత్తినవారు ఎందరో వున్నారు. ఈ విషయమై కూడా సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో ఈ ఫ్యాన్స్ వార్, ఫాల్స్ ప్రిస్టేజ్, ఆబ్లిగేషన్లు రాను రాను పెరుగుతాయి తప్ప తరగవు. అందుకే టాలీవుడ్ ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి. టాలీవుడ్ మొత్తం ఓ రిలీఫ్ ఫండ్ ను నెల నెల కొద్ది మొత్తాల్లో సేకరించి పక్కన వుంచాలి. ఇలాంటి విపత్తు వచ్చినపుడు ఆ ఫండ్ నుంచి సింగిల్ పేమెంట్ ను ప్రభుత్వాలకు ఇవ్వాలి. సింగిల్ పేమెంట్ తో సరిపోతుంది. అమౌంట్ భారీగా వుంటుంది. ఎవరికీ భారం అనిపించదు కూడా. లేదూ అంటే భవిష్యత్ లో టాలీవుడ్ హీరోల విరాళాలు అన్నవి కూడా బయటకు ఓ మాసివ్ కార్యక్రమంగా, లోలోపల భారంగా మారిపోయే ప్రమాదం వుంది.