తప్పు చేయడం మానవ సహజం. అయితే తప్పని తెలిసి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే మాత్రం … ఆ ధోరణి మనిషి లేదా వ్యవస్థ పతనానికి దారి తీస్తుంది. మొదట తప్పును సరిదిద్దుకోవాలంటే … అది తప్పు అని అంగీకరించే సంస్కారం కావాలి.
ఆ సంస్కారం ఉన్నవాళ్లెవరైనా జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు. ఓటమి విజయానికి తొలిమెట్టు అన్నట్టు … తప్పు అనేది కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. తప్పును సరిదిద్దుకోవడంలో తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం … ముఖ్య మంత్రిని తిట్టేవాళ్లు కూడా మెచ్చేలా ఉందని చెప్పొచ్చు.
ప్రతిపక్ష నేతగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి వెళ్లాయి. దీంతో తాను అధికారంలోకి వస్తే సమగ్ర భూసర్వే నిర్వహించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జనవరి ఒకటి నుంచి ప్రారంభమయ్యే రీసర్వే మూడు దశల్లో సాగాలని, 2023 నాటికి పూర్తి కావాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ గుడ్లుక్స్లో పడేందుకు సర్వే అధికారులు విపరీత ధోరణులకు పోయారు. సర్వే అనంతరం ఏర్పాటు చేసే సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మల్ని ముద్రించారు. ఈ విషయమై ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున నెగెటివ్ ప్రచారం ప్రారంభమైంది.
సహజంగానే జగన్ సర్కార్ను బద్నాం చేయాలనుకునే వాళ్లకు ఈ వ్యవహారం ఓ ఆయుధంలా మారింది. దీంతో సర్కార్ పెద్దలు దృష్టి సారించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మల్ని చిత్రీకరించాలని ఎవరు ఆదేశించారు? ఎందుకిలా చేశారంటూ సర్వే అధికారులపై సర్కార్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఒకవైపు సరిహద్దు రాళ్ల డిజైన్స్ ఎలా ఉండాలో ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ లోపు జగన్ చిత్రాలతో సర్వే రాళ్లంటూ ప్రచారంలోకి రావడంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ప్రత్యేక గ్రానైట్ రాళ్లపై ప్రభుత్వ ఎంబ్లమ్తోపాటు సీఎం జగన్ బొమ్మలను చిత్రించిన రాళ్లను అమరావతికి తెప్పించడంపై ప్రభుత్వ పెద్దలే ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తోంది.
సర్వే ఉన్నతాధికారుల అత్యుత్సాహం వల్ల సీఎంతోపాటు ప్రభుత్వ ప్రతిష్ఠా దెబ్బతినే అవకాశం ఉండడంతో ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సర్వే రాళ్లపై సీఎం చిత్రాలను పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసే విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోయి అభాసుపాలైన విషయం తెలిసిందే. బహుశా దాని నుంచి గుణపాఠం నేర్చుకున్న ప్రభుత్వం ….సమగ్ర సర్వే రాళ్లపై జగన్ చిత్రాల విషయంలో సరైన నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్లో ఇలాంటి మార్పును ముఖ్యంగా వైసీపీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి.