ఓటిటి పుణ్యమా అని అన్ని భాషల నటులు మన ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అదే సమయంలో మంచి చాన్స్ లు కూడా అందుకుంటున్నారు. ఇటీవల మలయాళంలో బాగా వినిపిస్తున్న పేరు జోజు జార్జ్. లేటెస్ట్ గా ఇరాట్ట సినిమాలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. అంతకు ముందు నయాత్తు, తురముఖం, మధురం వంటి సినిమాలు చేసాడు. ఇప్పడు తెలుగులోకి వచ్చేసాడు.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, నిర్మిస్తున్న సినిమాలో విలన్ గా జోజును తీసుకున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ ఫ్యాక్షన్ స్టోరీలో చెంగారెడ్డి అనే పాత్రలో జోజు కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.
జోజు ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఒక లుక్ ఫొటొ వదిలారు. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్ తో నోట్లోని సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఉన్న జోజు జార్జ్ పాత్ర తాలూకు పోస్టర్ పవర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంది.
అలాగే జోజు జార్జ్ నటించిన ఇరాట్ట సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందటంతో చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం.