చిన్న ‘పెద్దిరెడ్డి’.. నియంత అయిపోయారా?

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత.. అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా చెలామణీ అవుతున్న వారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన హవా సాగినట్టుగా మరెవ్వరి హవా కూడా సాగడం లేదు.…

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత.. అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా చెలామణీ అవుతున్న వారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన హవా సాగినట్టుగా మరెవ్వరి హవా కూడా సాగడం లేదు. ముఖ్యమంత్రి తరఫున అత్యంత కీలకమైన పనులన్నిటినీ కూడా.. పెద్దిరెడ్డి స్వయంగా చక్కబెడుతుంటారని కూడా పార్టీవారు అంటుంటారు. 

ఎక్కడ ఎన్నికలు జరిగినా దానికి సంబంధించిన వ్యూహరచనల దగ్గరినుంచి ఖర్చుల బాధ్యతల వరకు సమస్తమూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటూ ఉంటారు. ఆయనకు జగన్ వద్ద ఇంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. ఆయన మీద రాని విమర్శలు ఇప్పుడు.. ఆయన తమ్ముడి మీద వస్తున్నాయి. రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాధ రెడ్డి ప్రస్తుతం తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన నియోజకవర్గంలో నియంతలా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఏదో తెలుగుదేశం నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిచోటా అదే రికార్డు వేస్తుంటారని వదిలేయవచ్చు. కానీ వైసీపీకే చెందిన నాయకుడు, ఆ పార్టీ తరఫున తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త కొండ్రెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారని, సొంత పార్టీ వారి మీదనే కేసులు పెట్టిస్తున్నారని, నాయకుల్లో మహిళలను వేదిస్తున్నారని ఆయన అంటున్నారు. 

నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనే నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నారు. అలాంటిది చిత్తూరు జిల్లా పార్టీ రాజకీయాల్లు ఆయన మాటకు ఎదురులేదు. ఆయన మంత్రిగా ఉండగా, ఆయన కొడుకు మిధున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. తమ్ముడు ద్వారకనాధ్ రెడ్డి ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల నాటికి అన్నకొడుకును కుప్పం నుంచి ఎమ్మెల్యే చేయడానికి కూడా ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. 

అలాంటి పెద్దిరెడ్డి మీద పార్టీలో కొందరిలో అసంతృప్తులు ఉన్నా అవన్నీ ఎక్కడికక్కడ సమసిపోతుంటాయి గానీ.. ఇలా రచ్చకెక్కిన వ్యవహారాలు లేదు. 
పెద్ద పెద్దిరెడ్డి వలన రాని చెడ్డపేరు చిన్న పెద్దిరెడ్డి వల్ల వచ్చేలా ఉన్నదని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ద్వారకనాధ్ రెడ్డి పుంగనూరు నుంచి వలస వచ్చినా గెలిపించామని, ఇప్పుడు ఆయన స్థానిక నాయకులను తొక్కేస్తూ ఇతర ప్రాంతాల నుంచి నాయకులను తీసుకువచ్చి అందలం ఎక్కిస్తున్నారనేది.. వైసీపీ నేత కొండ్రెడ్డి ఆరోపణ. 

తెలుగుదేశం హయాంలో కూడా తాము ఇన్ని ఇబ్బందులు పడలేదని ఆయన అంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆందోళనలు చేయబోతున్నామంటూ.. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం విశేషం. అదే జరిగిందంటే పార్టీ పరువు పోతుంది. ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అన్న సామెత చందంగా.. పార్టీలో ఉన్న అసంతృప్తులపై దృష్టిపెట్టడానికి పెద్ద పెద్దిరెడ్డి సిద్ధంగానే ఉన్నారా? లేదా.. నా తమ్ముడిమీదనే ఆరోపణలు చేస్తారా? అంటూ హూంకరిస్తారా? చూడాలి!!