అధికారంలో ఉన్నపుడు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉత్తరాంధ్రాకు ఇవ్వడానికి చంద్రబాబుకు చేతులు రాలేదు. ఇక విశాఖను మాత్రం అనధికార రాజధానిగా వాడేసుకున్నారు. విశాఖకు వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని కుడా పక్కన పెట్టేశారు.
అప్పట్లో విశాఖకు నెలకు మూడు సార్లు చంద్రబాబు వచ్చేవారు. సదస్సులు, టూర్లు అంటూ హడావుడి చేసేవారు. వచ్చిన ప్రతీసారి విశాఖ ఆర్ధిక రాజధాని, సాంస్కృతిక రాజధాని అంటూ తెగ కీర్తించేవారు. ఇక్కడ ప్రజలు మంచివారు అంటూ బాగా ఉబ్బేసేవారు.
సరే ఇవన్నీ అయ్యాయి. అధికారం పోయింది. ఇపుడు వరసపెట్టి ఉత్తరాంధ్రాకు పార్టీ పదవులు పంచుతున్నారు. వాటి వల్ల ఉపయోగం ఏంటో తమ్ముళ్లకు అర్ధం కావడం లేదు కానీ పెద్ద పేర్లతోనే పదవులు ఇచ్చేశారు.
కానీ ఈ పదవులు తీసుకున్న వారందరికీ కండిషన్స్ అప్లై అన్నట్లుగా అక్కడ సీన్ ఉందిట. విశాఖ రాజధానిని వ్యతిరేకించండమే అందులో ప్రధానమైన కండిషన్. అందుకే ఇలా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారో లేదో అలా నోటి వెంట విశాఖ రాజధానికి వ్యతిరేకంగా అచ్చెన్నాయుడు విషం కక్కారు.
మరి మిగిలిన తమ్ముళ్ళు కూడా గొంతు సవరించుకుని అమరావతి రాగాలు తీయాల్సిందేనట. టీడీపీలో అమరావతి రాజధాని కోసం ఎంత వత్తిడి ఉంటుందో ఈ మధ్యనే సైకిల్ దిగేసిన ఎమ్మెల్యే తమ్ముడు వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు కూడా. ఆ బాధ తట్టుకోలేకే తాను పార్టీ వీడాను అని కూడా ఆయన చెప్పుకున్నారు. మొత్తానికి హై కమాండ్ స్క్రిప్ట్ విశాఖ వీధుల్లో నిలబడి చదవకపోతే తమ్ముళ్లకు పార్టీ పదవులూ హుష్ కాకీలా ఉన్నాయంటున్నారు.