పవన్‌కల్యాణ్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్. చాలా వరకు తన గొడవ తప్ప , సమాజ కష్టనష్టాల గురించి మాటల్లో తప్ప చేతల్లో పెద్దగా కనిపించవనే విమర్శ ఉంది. రామేశ్వరం పోయినా అదేదో పోనట్టు …సమస్య ఏదైనా అటు తిరిగి ఇటు తిరిగి సొంత విషయం గురించే పవన్ మాట్లాడ్తారు.
వరద బాధితులకు విరాళాల విషయమై సినీ ప్రముఖులపై విమర్శలు వస్తే …పవన్ స్పందించారు. బాగానే ఉంది. ఇక్కడ కూడా తన కుటుంబ అప్పుల గురించి ప్రస్తావించారు.
హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమ శక్తిమేరకు విరాళాలు ఇచ్చారు. అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొందరు సినీ సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వరా? మనసు రాదా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్‌ను గట్టిగా ప్రశ్నించారు.
అలాంటి కామెంట్స్‌పై తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమా రంగంలోని వారికి పేరేమో ఆకాశానికి అన్నట్లు ఉంటుందని, కానీ ఆ స్థాయిలో డబ్బు ఉండదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఇక్కడ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండదన్నారు.
కానీ సినిమా వాళ్ల దగ్గర చాలా సంపద ఉంటుందనే అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో బలంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎలాంటి విపత్తులు జరిగినా సినిమా పరిశ్రమ విరాళాలు ఇస్తూనే ఉందన్నారు.
ఎంతో శ్రమకోర్చి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, పది లక్షలు రూపాయలు విరాళాలుగా ఇవ్వాలంటే అలాంటి వారికి మనసు ఒప్పుతుందా? అని ప్రశ్నించారు. తన మాటకే వస్తే కొన్ని కోట్లు విరాళాల కింద ఇచ్చినట్టు పవన్ వెల్లడించారు. అలా విరాళాలు ఇవ్వాలంటే చాలా పెద్ద మనసు కావాలని పవన్ చెప్పుకొచ్చారు.
ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. అలాగే అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీకి గురై నెట్‌లో రిలీజ్ అయితే కొనటానికి ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యారెంటీ సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చిందని పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. సినిమా అంటే ఇన్ని కష్టనష్టాలు ఉంటాయని వెల్లడించారు.
ఆరెంజ్ సినిమా 2010 నవంబరు 26 న విడుదలైంది. ఇది ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ అన్న చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ, జెనీలియా జంటగా నటించారు. ఈ సినిమా నిర్మాత మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కావడం గమనార్హం.
ఈ సినిమా నష్టాల గురించి పవన్ మరోసారి ఇప్పుడు ప్రస్తావించారు. నాగేంద్రబాబుకు వచ్చిన నష్టాలను పూడ్చడానికి ఆస్తులు అమ్మాల్సి వచ్చిందని పవన్ తన వేదనంతా ఈ సందర్భంగా వెల్లడించారు.
అలాగే తాను హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా నెట్‌లో విడుదల కావడంతో ఎదురైన ఇబ్బందుల గురించి పవన్ ఏకరువు పెట్టారు. అన్నీ నష్టాలే అయితే సినిమాలు ఎందుకు తీస్తారో పవన్‌కల్యాణ్ వివరిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.