ఇద్దరి మధ్య ప్రేమకు కులం, మతం, ఆర్థిక అసమానతలు, వయసు …ఏవీ అడ్డంకి కావంటారు. ముఖ్యంగా పెళ్లి విషయానికి వస్తే అబ్బాయి కంటే అమ్మాయి వయసులో తక్కువగా ఉండాలని అంటారు. అలాగే ఎత్తులో కూడా అమ్మాయి తక్కువగా ఉండాలంటారు.
అనడమే కాదు మనదేశంలో ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకునే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. అయితే ఈ ధోరణులను ఫెమినిస్టులు కొట్టి పారేస్తారు. ఎందుకంటే పురుషాధిక్య సమాజంలో అన్నింట్లో మహిళల కంటే పురుషులే అధికులుగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా అణచివేస్తున్నారని స్త్రీవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడిప్పుడే పురుషుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. తాజాగా అలాంటి ఉదంతం గురించి చెప్పుకుందాం. బాలీవుడ్ కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు, కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్, బాలీవుడ్ నటి గౌహర్‌ఖాన్ డేటింగ్‌లో ఉన్నారని బీ-టౌన్ కోడై కూస్తోంది. నవంబర్‌లో వాళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ప్రస్తుతం గౌహర్ ఖాన్ బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నారు. తన కుమారుడితో గౌహర్‌ఖాన్ పెళ్లి గురించి జైద్ తండ్రి ఇస్మాయిల్ దర్బార్ ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించారు. జైద్, గౌహర్ ప్రేమలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. గౌహర్ అంటే తనకు అభిమా నమని, ఆమె కూడా తనంటే ఇష్టపడుతుందని జైద్ తనకు చెప్పాడన్నారు. వారిద్దరి ప్రేమ బంధంపై తమకు ఎలాంటి అభ్యంత రాలు లేవన్నారు.
ఇక్కడ వాళ్ల పెళ్లి విషయానికి వచ్చే సరికి, ఓ ముఖ్య విషయాన్ని ఆయన చెప్పారు. తన కుమారుడి కంటే వయసులో గౌహర్ ఐదేళ్లు పెద్దదన్నారు. ఈ విషయమై ఓ తండ్రిగా తన కుమారుడితో పంచుకున్నట్టు ఆయన తెలిపారు. పెళ్లికి ముందే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చానన్నారు.
అయితే ఇలాంటివి పట్టించుకోనని తన కుమారుడు కొట్టి పారేశాడన్నారు. వయసులో ఎక్కువ తక్కువల గురించి తనకు ఎలాంటి పట్టింపు లేవని తేల్చి చెప్పాడన్నారు. దీంతో అప్పటి నుంచి గౌహర్ తమతో మరింత ఆప్యాయంగా మెలుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. జైద్ దర్బార్, గౌహర్ జంట బాగుంటుందన్నారు.