17 నిమషాల ఫుటేజ్ ను సినిమా అనలేం. నటి సౌందర్య మరణంతో అర్థాంతరంగా ఆగిపోయిన నర్తనశాల సినిమా ఫుటేజ్ ను దసరా నాడు శ్రేయాస్ ఇటి లో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా హీరో బాలకృష్ణే నిర్మాత, దర్శకుడు కూడా. గత వారం రోజులుగా ఈ ఫుటేజ్ విడుదలకు చేస్తున్న ప్రచారం ఇంతా అంతా కాదు ఓ పెద్ద సినిమా విడుదలవుతున్నంత హడావుడి.
అలాగే ఈ బుజ్జి సినిమా కోసం ఓ బుల్లి ట్రయిలర్ కూడా కట్ చేసారు. శరత్ బాబు, శ్రీహరి, సౌందర్య, బాలకృష్ణ ఈ ట్రయిలర్ లో కనిపించి కనువిందు చేసారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ఇంట్రో సీన్ ను ట్రయిలర్ లో చూపించారు. సౌందర్య, శ్రీహరి ఇప్పుడు లేకపోవడంతో వారికి వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు.
అప్పట్లో ఫిలిం మీద చిత్రీకరించినా, డిజిటల్ క్వాలిటీతో సమానంగా వుండేలా అన్ని చర్యలు తీసుకున్నారు. అందువల్ల ట్రయిలర్ అందంగా కనిపించింది.
మొత్తం మీద ఈ బుజ్జి ట్రయిలర్ ఆ బుల్లి సినిమాను చూడాలనే ఆసక్తి కలిగించేలాగే వుంది.