హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రం

కొవిడ్‌బారిన ప‌డ్డ హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల కుమార్తె శివాత్మిక ట్వీట్ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. త‌మ కుటుంబ‌మంతా క‌రోనా బారిన ప‌డ్డామ‌ని, కుమార్తెలిద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని,…

కొవిడ్‌బారిన ప‌డ్డ హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల కుమార్తె శివాత్మిక ట్వీట్ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. త‌మ కుటుంబ‌మంతా క‌రోనా బారిన ప‌డ్డామ‌ని, కుమార్తెలిద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని, తాము కూడా త్వ‌ర‌గా కోలుకుని తిరిగి వ‌స్తామ‌ని రెండురోజుల క్రితం హీరో రాజ‌శేఖ‌ర్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌శేఖ‌ర్ కుటుంబ‌మంతా క‌రోనాకు గురి కాగానే ఆస్ప‌త్రిలో చేరారు. కుమార్తెలిద్ద‌రూ త్వ‌ర‌గా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే వ‌య‌సు రీత్యా రాజ‌శేఖ‌ర్ దంప‌తులు కొంత నెమ్మ‌దిగా కోలుకుంటున్న‌ట్టు అంద‌రూ భావించారు. తాజాగా రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాత్మిక నేటి ఉద‌యం చేసిన ట్వీట్ టాలీవుడ్‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

“కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు” అని శివాత్మిక కోరుతూ ట్వీట్ చేశారు.  

ఈ ట్వీట్‌లో నాన్న పోరాటం కాస్త క‌ష్టంగానే మారింది, అయినా ధైర్యంగా పోరాడుతున్నారు లాంటి మాట‌లు రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యంపై ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని ఆయ‌న అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఆకాంక్షిస్తున్నారు.