వైఎస్ఆర్సీపీ మాట‌ల తూటాగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి!

స్ప‌ష్ట‌మైన వ్య‌క్తీక‌ర‌ణ‌, సూటిగా సుత్తి లేని ప్ర‌సంగాలు, స‌హ‌జ‌మైన రాయ‌ల‌సీమ శైలి, ఆస‌క్తిదాయ‌క‌మైన మాట తీరు.. ఇవే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేత‌గా నిలుపుతున్నాయి. అటు…

స్ప‌ష్ట‌మైన వ్య‌క్తీక‌ర‌ణ‌, సూటిగా సుత్తి లేని ప్ర‌సంగాలు, స‌హ‌జ‌మైన రాయ‌ల‌సీమ శైలి, ఆస‌క్తిదాయ‌క‌మైన మాట తీరు.. ఇవే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేత‌గా నిలుపుతున్నాయి. అటు విజ‌య‌వాడ వైపు అయినా, ఇటు తాడిప‌త్రి వ‌ర‌కూ అయినా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ సిద్ధార్థ్ రెడ్డి ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల తూటాగా విరుచుకుప‌డుతున్నాడు. శాప్ చైర్మ‌న్ హోదా.. సిద్ధార్థ్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంలో ద‌క్కిన హోదా.

సొంత నియోజ‌క‌వ‌ర్గం నంది కొట్కూరు ఎస్సీ రిజ‌ర్వ‌డ్ కావ‌డంతో సిద్ధార్థ్ రెడ్డికి ఎమ్మెల్యే హోదా ప్ర‌స్తుతానికి అంద‌ని ద్రాక్షే! ఏ నెల్లూరు జిల్లా త‌ర‌హాలోనో అయితే.. సిద్ధార్థ్ రెడ్డి ఈ పాటికి ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం ఏదైనా చూసుకుని అక్క‌డ పాగా వేసేందుకు ప్ర‌య‌త్నించేవాడేమో! అయితే క‌ర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిక్కిరిసింది. అది కూడా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో కూడా స్థానిక‌త పెద్ద చ‌ర్చ‌గా నిలుస్తూ ఉంటుంది. రాయ‌ల‌సీమ‌లోనే దాదాపు అలాంటి పరిస్థితి ఉంది. 

ఏ రెండు ద‌శాబ్దాల కింద‌టో త‌మ‌ది కాని ఏరియాలో సెటిలైన నేత‌ల సంగ‌తిని ప‌క్క‌న పెడితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొత్త నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి నేత‌లు పాగా వేయ‌డం మాట‌లేమీ కాదు. ఇది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి అయినా వ‌ర్తించే అంశ‌మే. ఇలాంటి నేప‌థ్యంలో నందికొట్కూరు రాజ‌కీయానికే కొన్నాళ్ల పాటు ప‌రిమితం అయ్యి.. సిద్ధార్థ్ రెడ్డి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకున్నాడు. అక్క‌డి ఎమ్మెల్యే కు అడ్డంకిగా మారుతున్నాడ‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే నందికొట్కూరులో ఇలాంటివేమీ కొత్త కాదు. గ‌తంలో ల‌బ్బి వెంక‌ట‌స్వామి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు గౌరు ఫ్యామిలీ హ‌ల్చ‌ల్ చేసింది. ఐజ‌య్య మాత్రం చ‌లామ‌ణి అయ్యారు. ఇప్పుడు ఆర్థ‌ర్ వ‌ర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా కొన్నాళ్ల పాటు సాగింది. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి త‌త్వం బోధ‌ప‌రుచుకుని పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు. నందికొట్కూరుకు ప‌రిమితం కాకుండా విజ‌య‌వాడ నుంచి అనంత‌పురం వ‌ర‌కూ అన్ని చోట్లా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు.

తాడిప‌త్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వేదిక‌ను పంచుకుని జేసీ సోద‌రుల‌పై త‌న‌దైన శైలిలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విరుచుకుప‌డ్డాడు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గేట్లు తెరిస్తే చాలు జేసీ సోద‌రులు ప‌రుగులుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారంటూ వారి తీరును ఎద్దేవా చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎవ‌రినైనా ఎద్దేవా చేయ‌డంలో పేరెన్నిక గ‌న్న వారు జేసీ సోద‌రులు. అలాంటి వారిపై సిద్ధార్థ్ రెడ్డి అదే తీరున విరుచుకుప‌డ్డారు. 

ఈ కార్య‌క్ర‌మంలో జేసీ సోద‌రుల‌పై పెద్దారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు కూడా విరుచుకుప‌డ్డారు. అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల ప్ర‌సంగం క‌న్నా.. సిద్ధార్థ్ రెడ్డి మాట‌ల తూటాలు ప్ర‌త్యేకంగా నిలుస్తున్నాయి. మ‌రి ఈ రూట్లో సిద్ధార్థ్ రెడ్డి దూసుకుపోతే.. సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే ఉన్న గుర్తింపుకు తోడు రాష్ట్ర స్థాయి నేత‌గా ధీటైన గుర్తింపు ద‌క్క‌డం ఖాయం!