సీజనల్ పొలిటీషియన్ పవన్ కల్యాణ్ మళ్లీ సైలెంట్ అయ్యారు. క్రిస్మస్ కు ముందు కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి మమ అనిపించారు. క్రిస్మస్ కోసం భార్య సొంత దేశం రష్యా వెళ్లారు, పండగ వేళ ఆయన వేసిన ట్వీట్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. నటి మాధవీలత రియాక్షన్ తో పవన్ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు కానీ, ఆయన మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారు. క్రిస్మస్ తర్వాత మరికొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు పవన్. మళ్లీ ఎప్పుడు రాజకీయ ముఖచిత్రంపైకి వస్తారో తెలీదు కానీ ఈలోగా సినిమాలు మాత్రం రెడీగా ఉన్నాయి.
పవన్ కల్యాణ్ అంటే ఎవరు..? జనసేనాని, జనసేన పార్టీ అధినేత అనే పేరు కంటే… వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అనే పేర్లు మాత్రమే బాగా వినిపిస్తాయి. ఆయనపై జనానికి, అభిమానులకు ఉన్న అభిప్రాయం అదే. పవన్ ని సినిమా హీరోగా మాత్రమే చూస్తున్నారు కానీ, రియల్ పొలిటీషియన్ గా ఒక్కరూ గుర్తించడంలేదు. పవన్ కూడా దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు.
నా సినిమాలపై కక్ష సాధిస్తున్నారంటూ పొలిటికల్ మీటింగుల్లో రెచ్చిపోతారు కానీ, నా జనాలకు ఇబ్బంది కలుగుతోందని మాత్రం అడగడానికి ఆయనకి నోరు రాదు. అందుకే పవన్ ని సీజనల్ పొలిటీషియన్ అంటారు, సీరియస్ సినిమా హీరోగా గుర్తిస్తారు.
ఆ మధ్య పవన్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా కదలి వచ్చారు, అమరావతి రైతుల తిరుపతి సభకు మాత్రం డుమ్మా కొట్టారు. అమరావతి ఉద్యమానికి జనసేన తరపున మద్దతిస్తున్నా.. విశాఖ నుంచి పోటీ చేయాలని చూస్తున్న పవన్ కి.. పరిపాలనా రాజధానిని అడ్డుకోవడం కష్టంగా మారింది. అందుకే ఆయన ఆ విషయంలో గోడమీద పిల్లివాటం చూపిస్తున్నారు.
మళ్లీ ఎప్పుడు భీమలా నాయకా..?
పవన్ కి ఎప్పుడు మూడొస్తే అప్పుడు రాజకీయాల్లోకి దూకుతుంటారు. అప్పటి వరకూ ఆయనకు సినిమాలే ముఖ్యం. రాజకీయాల్లో ఇలా సీజనల్ వ్యవహారం అస్సలు పనికిరాదు. సీరియస్ గా చేస్తేనే ఫలితం ఉంటుంది, కానీ పవన్ కి అంత ఓపిక లేదు.
ఆయన ప్రత్యేకంగా ఓ అంశంపై కష్టపడే రకం కాదు. ఇవన్నీ తెలిసినా ఇంకా పవన్ కోసం జనసైనికులు అక్కడక్కడ కదలి వస్తున్నారంటే అది సినిమా హీరోగా ఆయనకున్న క్రేజ్ మాత్రమే. దాన్ని నిలబెట్టుకోవాలంటే పవన్ వారాలబ్బాయిగా తనకున్న ఇమేజ్ ని చెరిపేసుకోవాలి.