బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించే విధానంపై మ్యూజిక్ డైరక్టర్ తమన్ తనదైన స్టయిల్ లో పంచ్ వేశాడు. ఒకే సినిమాకు ఆరుగురు సంగీత దర్శకులు ఎలా పనిచేస్తారో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఒక సినిమాకు ఒకరు కంటే ఎక్కువమంది సంగీత దర్శకులు పనిచేస్తే.. పెళ్లి ఒకర్ని చేసుకొని, శోభనం మరొకరితో జరిపించినట్టు ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
“బాలీవుడ్ మేకర్స్ మ్యూజిక్ ను చూసే విధానం నాకు నచ్చలేదు. ఒక్క పాట చేయమంటారు, ఒక్క రీల్ చేస్తే చాలు అంటారు. బాలీవుడ్ లో మ్యూజిక్ ఎలా ఉంటుందంటే.. పెళ్లి ఒకడితో, ఫస్ట్ నైట్ మరొకడితో అన్నట్టు ఉంటుంది. ఒక సినిమాకు ఆరుగురు మ్యూజిక్ ఎలా చేస్తారో నాకు అర్థంకావడం లేదు. ఒక కథను ఆరుగురు సంగీత దర్శకులు ఎలా కంటిన్యూ చేస్తారో తెలియడం లేదు. ఇవన్నీ పక్కనపెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే వాడు ఎవడో చేస్తాడు. అలాంటప్పుడు మనం మనసుపెట్టి చేయలేం. అది కరెక్ట్ కాదని వెనక్కి వచ్చేశాను.”
ఓ సినిమాకు అరకొరగా పనిచేయడం తనకు ఇష్టం ఉండదని చెప్పిన తమన్.. మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెడితే, పూర్తిస్థాయిలో మ్యూజిక్ అందించే సినిమాతో మాత్రమే రీఎంట్రీ ఇస్తానని స్పష్టంచేశాడు. అది కూడా సౌత్ నుంచి త్రివిక్రమ్, శంకర్ లాంటి దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పుడు, వాళ్ల సినిమాలతోనే రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు వెల్లడించాడు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకు కూడా ఇలానే చాలామంది సంగీత దర్శకులు వర్క్ చేశారు. ఒక్కో పాటకు ఒక్కో మ్యూజిక్ డైరక్టర్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.