అవును. ఇది నిజం. ఏపీకి గుండెకాయ ఎక్కడ ఉంది అంటే ఈ రోజుకీ విశాఖపట్నాన్నే చెప్పుకోవాలి. ఏపీకి ఉన్న ఏకైక మెగా సిటీగా దీన్ని అంతా పేర్కొంటారు. ఇదిలా ఉంటే జగన్ సీఎం అయ్యాక విశాఖలో పరిశ్రమలు ఏవీ రావడం లేదు అన్న విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ విశాఖలో ఉన్న మెడిటెక్ జోన్ లో ట్రాన్స్లూమినా సంస్థ తన నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించింది.
ఈ సంస్థ అరోగ్యపరికరాల కొరకు వివిధ రకాల వాల్వులను తయారు చేస్తుందని చెబుతున్నారు. అంతే కాదు, హార్ట్ వాల్వులను ఈ సంస్థ తయారు చేస్తుంది. అంటే గుండె కవాటాలకు సంబంధించిన పరికరాలు అన్న మాట. అలా గుండెకాయ లాంటి సంస్థ విశాఖలో ఏర్పాటు అవుతోంది అని అధికారులు చెబుతున్నారు.
తాజాగా భూమి పూజ చేసుకున్న ఈ సంస్థ తన సంస్థ నిర్మాణానికి గట్టిగా ఏడాది టైమ్ తీసుకున్నా 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని అంటున్నారు. అంటే 2023లో ఇక్కడ నుందే హార్ట్ వాల్వులతో పాటు అనేక రకాలైన మెడికల్ పరికరాలు ఇక్కడ నుంచే తయారవుతాయన్న మాట.
అదే విధంగా ఈ యూనిట్లో ట్రాన్స్కేథటర్, మిట్రల్, ట్రైకుస్పిడ్ వాల్వులను తయారు చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సంస్థ రావడం ద్వారా విశాఖకు కొంతలో కొంత పారిశ్రామిక కళ వచ్చినట్లే అంటున్నారు.