చెప్పే వాళ్లను బట్టి ప్రభుత్వం వింటుందనేందుకు తాజా ఉదంతమే నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్ల యజమానులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త ఏడాది ప్రారంభానికి ముందు జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం ఆసక్తి పరిణామంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో సీజ్ చేసిన 83 థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇదంతా నటుడు ఆర్.నారాయణమూర్తి పలుకుబడితో సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవాళ మంత్రి పేర్ని నానిని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు కలిశారు. సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సినిమా అంటే నటీనటులే కాదని ప్రేక్షకులు, థియేటర్ యజమానులు, అందులో పని చేసే కార్మికులు కూడా అని ఇటీవల ఆర్.నారాయణమూర్తి అన్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను అందరికీ ఆమోద యోగ్యంగా నిర్ణయిస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుందని, ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేయడం, ఆ తర్వాత మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కార్మికుల పక్షపాతిగా, పేద కళాకారుల ఆప్తుడిగా పేరొందిన నారాయణమూర్తి నేరుగా మంత్రిని కలవడం, వెంటనే సానుకూల ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో 83 థియేటర్లను ప్రభుత్వం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి థియేటర్లకు ప్రభుత్వం వెసలుబాటు కల్పిస్తూ మంత్రి కీలక ప్రకటన చేశారు. అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు.
అన్ని వసతులు కల్పించిన తర్వాత నెల రోజుల్లో తిరిగి జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తామని ఆయన చెప్పడంతో ఒక సమస్యకు పరిష్కారం లభించినట్టైంది. ఇదిలా ఉండగా ఆర్.నారాయణమూర్తికి జగన్ ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉందనే సంకేతాలు వెళ్లాయి. గతంలో జగన్ ప్రభుత్వంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.